Share News

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులపై అవగాహన అవసరం

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:25 PM

జిల్లాలో అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలో నిర్మించతలపెట్టిన పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌లపై ఆయా ప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండడం ఎంతో అవసరమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఇతర అధికారులు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి

పాడేరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలో నిర్మించతలపెట్టిన పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌లపై ఆయా ప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండడం ఎంతో అవసరమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ. నెడ్‌క్యాప్‌ అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుతో తమకు, తమ ప్రాంతాలకు కలిగే ప్రయోజనాలపై ప్రజలు అవగాహన చేసుకోవాలన్నారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగానే వాటిని ప్రభుత్వం నిర్మించాలని ప్రతిపాదించిందన్నారు. అలాగే వాటి నిర్మాణంతో 116 ఎకరాల అటవీ భూమి, 1,302 ఎకరాల్లో అటవీయేతర భూములు ప్రభావితం అవుతాయని, పలు గ్రామాల్లోని 304 ఎకరాల్లో ముంపు ఉంటుందన్నారు. తంగలగూడ, కాగువలస, అడ్డుమండ, సంకుపర్తి, దామపర్తి, తదితర గ్రామాలకే ముంపు ఏర్పడుతుందని, అలాగే ప్రత్యక్షంగా నాలుగు వందలు, పరోక్షంగా మూడు వేల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వివరించారు. నెడ్‌క్యాప్‌, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థల నిర్మాణం, నిర్వహణ మాత్రమే జరుగుతుందన్నారు. అలాగే పర్యావరణానికి హాని కలగకుండా భూగర్భ పైప్‌లైన్లు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని, ప్రభావిత పల్లెలకు సైతం పైపుల ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. ఎగువ, దిగువ జలాశయాల నిర్మాణం, అనుసంధానానికి సర్వే చేయాల్సి ఉందని, ఆయా పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో స్థానిక ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో టెలీ కమ్యూనికేషన్‌, రోడ్లు, వైద్యశాలలు, రవాణా సౌకర్యాలు, ప్రత్యేకంగా విద్యాలయాలు, నైపుణ్య శిక్షణ సంస్థల ఏర్పాటు జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా పునరావాస చట్టం ప్రకారం నిర్వాసితులకు మెరుగైన పునరావాస చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Oct 27 , 2025 | 10:25 PM