రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:47 AM
ఎలమంచిలి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని పులపర్తి జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన పి.రఘురామిరెడ్డి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం నుంచి హైదరాబాద్ నగర శివారులోని అల్మాస్‌గుడ వినాయక హిల్స్‌లో నివాసం వుంటున్నారు. వ్యక్తిగత పనిమీద విశాఖపట్నం వచ్చిన ఆయన ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారి మీదుగా రాజమహేంద్రవరం వైపు వెళుతున్నారు. ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న పులి మల్లికార్జున్ అనే స్థానికుడిని బలంగా ఢీకొన్నారు. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైర్‌ను ఢీకొన్నది. రఘురామిరెడ్డికి నుదుటిపై బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మల్లికార్జున్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇతనిని ఎలమంచిలి సీహెచ్‌సీకి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి, మృతునివద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.