అద్దె భవనంలో నిర్వహిస్తున్న నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:01 AM
జిల్లాలో అబ్కారీ శాఖ కార్యాలయాలు పరాయి పంచన కొనసాగుతున్నాయి. నర్సీపట్నంలో 37 ఏళ్ల నుంచి అదే భవనంలో నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
- జిల్లాలోని ఎనిమిది స్టేషన్లకు గాను ఏడు అద్దె భవనాల్లో నిర్వహణ
- శిథిలావస్థలో నర్సీపట్నం స్టేషన్ భవనం
- సీజ్ చేసిన వాహనాలకు భద్రత కరువు
- సొంత భవనాలు లేక ఇబ్బందులు
నర్సీపట్నం, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అబ్కారీ శాఖ కార్యాలయాలు పరాయి పంచన కొనసాగుతున్నాయి. నర్సీపట్నంలో 37 ఏళ్ల నుంచి అదే భవనంలో నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ప్రొహిషన్, ఎక్సైజ్ స్టేషన్లు ఎనిమిది ఉన్నాయి. అనకాపల్లి, సబ్బవరం, నర్సీపట్నం, గొలుగొండ, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేట, వి.మాడుగుల ఎక్సైజ్ స్టేషన్లలో చోడవరం స్టేషన్ తప్పితే మిగిలిన ఏడు కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. చోడవరం ఎక్సైజ్ స్టేషన్ శిథిలావస్థలో ఉన్న ఆర్‌అండ్‌బీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలలో సరైన సౌకర్యాలు లేక సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిఅవస్థలు పడుతున్నారు. మూడు, నాలుగు దశాబ్దాల నుంచి ఎక్సైజ్ స్టేషన్‌లు సొంత భవనాలకు నోచుకోకపోవడం గమనార్హం. నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ మంజూరు అయిన దగ్గర నుంచి అద్దె భవనంలోనే నడుపుతున్నారు. ఇప్పుడున్న అద్దె భవనంలో 1988 నుంచి స్టేషన్ నడుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో సీఐ గదితో పాటు వరండాలో శ్లాబ్ పెచ్చులు సిబ్బందిపై పడుతున్నాయి. వర్షం పడితే శ్లాబ్ నుంచి నీరు కారుతోంది. ఎక్సైజ్ ఎస్‌ఐ గది గుమ్మం, తలుపు పాడై ఊడిపోయాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి గది లేక వరండాలో పని చేస్తున్నారు. ముఖ్యమైనఫైళ్లను ఆరుబయట ఉంచాల్సి వస్తోంది. గంజాయి, మద్యం, నాటు సారా కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాలను ఆరుబయట ఉంచడం వలన వాటికి భద్రత కరువైంది. వాహనాల విడి భాగాలు, టైర్లు చోరీకి గురయ్యాయి. 99 కేసుల్లో సీజ్ చేసిన 134 వాహనాలను ఆరుబయట వదిలేశారు. కొన్ని వాహనాలను స్టేషన్‌ను ఆనుకొని ప్రైవేటు స్థలంలో నిలిపారు. ప్రైవేటు స్థలం యజమాని ఇటీవల దీనిపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం, చింతపల్లి రోడ్డుకి ఇరువైపులా ఎక్సైజ్ వాహనాలు పార్కింగ్ చేసి ఉంచడం వివాదాస్పదంగా మారింది. వీటి వలన ట్రాఫిక్‌కి ఇబ్బంది కలుగుతోందని, వెంటనే అక్కడ నుంచి తీసేయాలని న్యాయమూర్తి, పోలీసులు అనేక పర్యాయాలు ఎక్సైజ్ సీఐకి చెప్పారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులకు ఎక్సైజ్ వాహనాలు అడ్డుగా ఉన్నాయని, తక్షణమే అక్కడ నుంచి తొలగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్‌ను వేరే ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాహనాలు పెట్టుకోవడానికి, కార్యాలయం నిర్మాణానికి ఎకరా స్థలం అవసరం పడుతుందని అధికారులు అంటున్నారు. దీనిపై జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి సుధీర్‌ని వివరణ కోరగా జిల్లాలోని ఏడు స్టేషన్లు అద్దె భవనాలలో నడుపుతున్నామని చెప్పారు. చోడవరం స్టేషన్ ఆర్‌అండ్‌బీ భవనంలో ఉందని తెలిపారు. సొంత భవనాలు అవసరమని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని, గతంలో కూడా ప్రతిపాదనలు పంపామని చెప్పారు.