Share News

హెల్త్‌ హబ్‌గా నర్సీపట్నం

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:20 AM

హెల్త్‌ హబ్‌గా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంలో భాగంగా గర్భిణుల కోసం రూ.2.1 కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

హెల్త్‌ హబ్‌గా నర్సీపట్నం
ప్రసూతి నిరీక్షణ కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ఏరియా ఆస్పత్రిని 200 పడకలకు విస్తరించడానికి ప్రతిపాదనలు

రూ.2.1 కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రం

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): హెల్త్‌ హబ్‌గా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంలో భాగంగా గర్భిణుల కోసం రూ.2.1 కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నంలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం శిలాఫలకాన్ని కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న నర్సీపట్నంలో పెద్దాస్పత్రి కావాలని అడిగితే 1988లో ఎన్టీరామారావు వంద పడకల ఆస్పత్రి మంజూరు చేశారని, ఆయనే స్వయంగా ప్రారంభించారని తెలిపారు. తరువాత చంద్రబాబునాయుడు 150 పడకల ఆస్పత్రి చేశారన్నారు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 200 పడకలు చేయాలని ప్రతిపాదనలు పంపామని తెలిపారు. చివరి గడియ వరకు గర్భిణులు ఆస్పత్రికి రాకుండా ఉంటున్నారని, దీని వలన ప్రసవం సమయంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఇబ్బందులు లేకుండా రెండు రోజుల ముందే నిరీక్షణ కేంద్రంలో ఉండడానికి ఏర్పాట్లు చేశామన్నారు. వారికి సహాయంగా వచ్చిన వారికి కూడా మంచాలు ఏర్పాటు చేశామని, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి పాయకరావుపేటలోని డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ యజమాని కేవీఎల్‌పీ రాజు రూ.2.1 కోట్ల నిధులు సమకూర్చారని, దీనికి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పూర్తిగా సహకరించారని తెలిపారు. విద్య, వైద్య అవసరాలకు ఏ విధమైన సహకారం కావాలన్నా చేస్తానని రాజు మాటిచ్చారని, ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌ల అభివృద్ధికి ఎన్‌టీపీసీ నుంచి సీఎస్‌ఆర్‌ గ్రాంట్‌ రూ.72.5 లక్షలు మంజూరు చేశారన్నారు. ఏరియా ఆస్పత్రికి టిఫా స్కానింగ్‌ యంత్రం మంజూరైందన్నారు. గర్భస్థ శిశువు లోపాలు గుర్తించడానికి ఈ స్కానింగ్‌ మెషీన్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. రోజుకు నలుగురికి మాత్రమే స్కానింగ్‌ అవుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో టిఫా స్కానింగ్‌ మెషీన్‌ను చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ యజమాని కేవీపీఎల్‌ రాజు, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జ్యోతి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాశారద, జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర, జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి, సుకల అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:20 AM