Share News

3 నుంచి నృసింహ దీక్షలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:46 AM

హైందవ ధర్మ పరిరక్షణ, సింహాచలం క్షేత్ర మహాత్మ్యం ప్రచారానికి ఉద్దేశించిన నృసింహ దీక్షలకు డిసెంబరు 3వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్‌.సుజాత ప్రకటించారు.

3 నుంచి నృసింహ దీక్షలు

సింహాచలం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

హైందవ ధర్మ పరిరక్షణ, సింహాచలం క్షేత్ర మహాత్మ్యం ప్రచారానికి ఉద్దేశించిన నృసింహ దీక్షలకు డిసెంబరు 3వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్‌.సుజాత ప్రకటించారు. దేవాలయ వైదిక కమిటీ నిర్ణయం మేరకు సంప్రదాయ విధానంలో మాలధారణ ప్రారంభమవుతుందన్నారు. జనవరి 12న దీక్షల విరమణ జరుగుతుందన్నారు. ద్వాత్రింశతి దీక్షలు డిసెంబరు 11న ప్రారంభమై జనవరి 12న పరిసమాప్తమవుతాయన్నారు. దీక్షలు స్వీకరించు భక్తులకు ఉచితంగా తులసి మాలలు, స్వామివారి ప్రతిమలను అందజేస్తామన్నారు.

జనవరిలో పలు ప్రధాన రైళ్లు రద్దు

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు.

జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌ (22708); 28, 29 తేదీల్లో విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), మచిలిపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219); 29న విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ (22707), 29, 30 తేదీల్లో లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806), విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220), 28, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239), 29, 31 తేదీల్లో విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్‌ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్‌ (67286), జనవరి 31న గుంటూరు-విశాఖ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22876), విశాఖ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22575) రద్దు కానున్నట్టు పేర్కొన్నారు.


కొండపై బదిలీల్లో స్వల్పమార్పులు

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానంలో ఓ ఏఈఓ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, పాలనా అవసరాల పేరుతో పలువురు ఉద్యోగులను ఆకస్మికంగా బదిలీ చేశారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై దేవదాయ శాఖ అదికారులు గురువారం స్పందించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆలయానికి వెళ్లి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను హెచ్చరించారు. మరోవైపు నిత్యం ఘర్షణలు పడే ఉద్యోగికి వీవీఐపీలు వచ్చే కొండపై ఎలా విధులు కేటాయిస్తారంటూ కమిషనర్‌ కార్యాలయం ఆలయ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. అంతర్గత బదిలీలు చేసే ముందు ఎవరిని ఎక్కడ వేస్తున్నారో పరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు. విజయనగరం విద్యార్థుల హాస్టల్‌లో పనిచేస్తున్న వ్యక్తిని వెంటనే కొండపై పారిశుధ్యం పర్యవేక్షణ విధుల నుంచి తప్పించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అయితే విజయనగరంలో హాస్టల్‌ విద్యార్థులు కూడా సదరు ఉద్యోగి తమను వేధిస్తున్నాడని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు పంపడంతో, విజయనగరం పంపకుండా కొండ దిగువన విధులు కేటాయించారు. అంతర్గత బదిలీల్లో ఇంకో ముగ్గురిని యథాస్థానాలకు పంపించారు.

Updated Date - Nov 28 , 2025 | 12:46 AM