బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా నాగేంద్ర
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:12 AM
బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ప్రకటించారు.
కార్యదర్శిగా సురేంద్రమోహన్
ఉపాధ్యక్షునిగా ఆడారి ఆనందకుమార్
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ప్రకటించారు. అందులో విశాఖపట్నం వారికి అధిక ప్రాధాన్యం లభించింది. గత కమిటీకి దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కోశాధికారిగా పనిచేసిన మొగళ్ల నాగేంద్రను ఇప్పుడు అదే పదవిలో మాధవ్ కొనసాగించారు. నాగేంద్ర విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఏడేళ్లు బాధ్యతలు నిర్వహించారు. అలాగే విశాఖకు చెందిన యువ నాయకుడు సురేంద్రమోహన్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. విశాఖ నుంచే సుజాతకు మహిళా కోటాలో కార్యదర్శి పదవి ఇచ్చారు. సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎ.కేశవ్‌కాంత్‌ని నియమించారు. ఇక అనకాపల్లి జిల్లా నుంచి ఆడారి ఆనంద్‌కుమార్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు.
స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్
జిల్లాలో 5.24 లక్షల బియ్యం కార్డులు
ఇప్పటివరకూ 5.17 లక్షల స్మార్ట్ కార్డులు రాక
25 నుంచి సచివాలయాల ద్వారా పంపిణీ
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
కొత్తగా ఏటీఎం కార్డు సైజులో రూపొందించిన స్మార్ట్ రైస్ కార్డులను ఈనెల 25వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. కార్డుదారులు సచివాలయానికి వెళ్లి వీటిని తీసుకోవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి విధివిధానాలు శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖకు వచ్చే అవకాశం ఉంది.
జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.24 లక్షల బియ్యం కార్డులు ఉండగా, ఇప్పటివరకూ 5.17 లక్షల స్మార్ట్ కార్డులు నగర పరిధిలో మూడు సర్కిళ్లు, నాలుగు మండలాల పౌర సరఫరాల కార్యాలయాలకు చేరాయి. ఈ స్మార్ట్ కార్డుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిహ్నాలు, నంబరు, కుటుంబ పెద్ద పేరు (ఇంటి యజమాని భార్య), వయస్సు, పుట్టిన తేదీ, కుటుంబంలో సభ్యుల వివరాలు, రేషన్ డిపో ఐడీ నంబరు, చిరునామా ముద్రించారు. ప్రతి కార్డును క్యూఆర్ కార్డుతో స్కాన్ చేసే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే కార్డులు ఉన్నవారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కూడా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారు. జిల్లాలో ఇప్పటివరకూ 5,310 మంది కొత్త కార్డుకు దరఖాస్తు చేస్తే వారిలో 3,456 మంది వివరాలు పరిశీలించి ఆమోదించారు. వారికి కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. ఇంకా కార్డులో అడ్రస్ మార్పునకు 1,679 మంది, ఇతర వివరాల మార్పునకు 1,050 మంది దరఖాస్తు చేసుకున్నారు. కార్డులో తప్పొప్పుల సవరణకు 1,010 మంది, కొత్తగా కుటుంబ సభ్యుల వివరాలు చేర్పడానికి 32,378 మంది, తొలగింపుల కోసం 2,131 మంది, కార్డుల విభజనకు 4,401 మంది, సరండర్‌కు 22 మంది దరఖాస్తు చేశారు. అన్ని కేటగిరీలు కలిపి 47,981 దరఖాస్తులు రాగా ఇంతవరకూ 35,492 దరఖాస్తులు పరిశీలించి ఆమోదించారు. వారందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీచేస్తారు.