Share News

‘హైడ్రో పవర్‌’పై అపోహలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:48 AM

రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అదనపు విద్యుత్‌ అందుబాటులోకి రావడమే కాకుండా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.

‘హైడ్రో పవర్‌’పై అపోహలు
హైడ్రో ప్రాజెక్టు నమూనా చిత్రం

ఏపీ క్లీన్‌ ఎనర్జీ పాలసీలో భాగంగా

మన్యానికి రెండు ప్రాజెక్టులు మంజూరు

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుజ్జెలి,

చిట్టంవలస ప్రాంతాల్లో ఏర్పాటు

2,300 మెగావాట్‌ల సామర్థ్యం

ఇతర ప్రాంతాల నుంచి నీరు...

గ్రామాల ముంపు అపోహ మాత్రమే

భారీగా పెరగనున్న ఉపాధి అవకాశాలు

(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అదనపు విద్యుత్‌ అందుబాటులోకి రావడమే కాకుండా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిలాల్లో రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనంతగిరి మండలం గుజ్జెలిలో 1,500 మెగావాట్లు, చిట్టంవలసలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇవి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కావడం గమనార్హం. అంటే వర్షాకాలంలో అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించుకుంటూ, అదనంగా ఉన్న నీటిని నిల్వ చేసుకుంటాయి. అవసరమైన చోట్ల డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిర్మిస్తాయి. ఆ నీరు విద్యుదుత్పత్తికి సరిపోని సందర్భాల్లో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పంపింగ్‌ చేసుకుంటాయి. అందుకే వీటిని పంప్డ్‌ హైడల్‌ ప్రాజెక్టులుగా వ్యవహరిస్తున్నారు.

ముంపు సమస్య అపోహ మాత్రమే

ఈ రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల కారణంగా హుకుంపేట, అరకులోయ, అనంతగిరి మండలాల్లోని ఎనిమిది పంచాయతీల్లో పలు గ్రామాలు ముంపునకు గురవుతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి నీటిని రప్పించడం వల్ల ముంపు సమస్య ఎదురుకాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పనులన్నీ శాస్త్రీయంగా, ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో, పద్ధతి ప్రకారం చేపడతారని, అపోహలు పెంచుకోవద్దని సూచిస్తున్నారు. డ్యామ్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌ల పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొంటున్నారు. వీటివల్ల పర్యావరణానికి గానీ, ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులకు గానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని భరోసా ఇస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి నీటిని రప్పించడం వల్ల స్థానిక జల వనరులకు ముప్పు రాదని కూడా చెబుతున్నారు. ఈ విషయాల్లో ఆందోళన తగదని, స్థానిక గిరిజనులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా చర్యలు చేపడతామని అంటున్నారు. అంతేగాకుండా వీటివల్ల ఏజెన్సీలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విద్యుత్‌ ఆధారిత పరిశ్రమలను గిరిజనులు కూడా ఏర్పాటుచేసుకునే అవకాశం లభిస్తుందని అంటున్నారు. రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో కొన్ని సంవత్సరాల పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అవి పూర్తయ్యాక నైపుణ్యం కలిగిన వారికి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో ఉపాధి దొరుకుతుంది. చదువుకున్న గిరిజన యువతకు విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటిలోను ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపే ప్రాజెక్టులుగా వీటికి గుర్తింపు లభించనుంది. ప్రభుత్వం గిరిజనులకు ఎటువంటి నష్టం లేకుండా, వారికి మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సదస్సులు నిర్వహించి వారిలో అపోహలు తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:48 AM