మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:54 AM
సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద పక్షం రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి ప్రవర్తనతో విసుగుచెందిన కుమార్తెలు.. బాబాయ్‌తో కలిసి హత్య చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలే అంతమొందించారు
బాబాయితో కలిసి హత్య చేసిన ఇద్దరు కుమార్తెలు
మృతదేహాన్ని బాటజంగాలపాలెం తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పటించిన బాబాయి
ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు
తల్లి ప్రవర్తనతో విసుగు చెంది కడలేర్చినట్టు విచారణలో వెల్లడి
నిందితుల్లో ఒకరు మైనరు
ఒడిశా నుంచి వలస వచ్చి కూర్మన్నపాలెంలో నివాసం
అనకాపల్లి రూరల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద పక్షం రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి ప్రవర్తనతో విసుగుచెందిన కుమార్తెలు.. బాబాయ్‌తో కలిసి హత్య చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన బంకెల సంతు(37)కు భర్తతో కొంతకాలం క్రితం స్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. సంతు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నది. పెద్ద కుమార్తె అనూష పంజాబ్‌లోని యూనివర్సిటీలో చదువుతున్నది. 15 ఏళ్ల చిన్న కుమార్తె ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ, హాస్టల్‌లో వుంటున్నది. సంతు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు లోనయి డబ్బులు వృథా చేస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తెలతోపాటు సంతు మరిది మురళీధర్ ఇటీవల ఆమెతో గొడవపడ్డారు. కాగా హాస్టల్‌లో వుంటున్న చిన్న కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఫోన్‌లో అసభ్యకర దృశ్యాలతోపాటు బెట్టింగ్ యాప్‌లు వుండడాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని అక్క అనూషకు చెప్పడంతో ఆమె పంజాబ్ నుంచి ఇక్కడకు వచ్చింది. ఇద్దరూ కలిసి తల్లిని నిలదీసి, ఆమెతో గొడవపడ్డారు. తల్లి ప్రవర్తనతో విసుగు చెందిన కుమార్తెలు... ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌నగర్‌లోనే నివాసం వుంటున్న బాబాయ్ మురళీధర్‌కు ఈ విషయం చెప్పి, ఆయన సాయం కోరారు. ముగ్గురూ కలిసి ప్రణాళికను రూపొందించుకుని ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో వున్న ఉన్న సంతుని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురళీధర్ తన స్నేహితుడి కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్దకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 14వ తేదీ ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు, సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్బవరం పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తుహిన్ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు.. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. సంతుని ఆమె కుమార్తెలు, మరిది కలిసి హత్య చేసినట్టు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. మురళీధర్‌తోపాటు అనూషను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితురాలు మైనర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచినట్టు ఎస్పీ చెప్పారు.