Share News

యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ

ABN , Publish Date - May 31 , 2025 | 12:55 AM

ఎలమంచిలి సమీపంలో జాతీయ రహదారి పక్కన రెండున్నరేళ్ల క్రితం జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఇక్కడ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌ వెల్లడించారు.

యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ
మీడియా సమావేశంలో డీఎస్పీ విష్ణుస్వరూప్‌, పోలీసు అధికారులు, వెనుక వరుసలో నిందితులు


ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

రెండున్నరేళ్ల క్రితం ఎలమంచిలి హైవే పక్కన గుర్తు తెలియని మృతదేహం

ఆనవాళ్లు లభించకపోవడంతో చాలా కాలంపాటు ముందుకు సాగని దర్యాప్తు

ఎట్టకేలకు ఆధారాలు లభించడంతో నిందితుల అరెస్టు

హత్యకు గురైన యువతి సొంతూరు పూడిమడక

ఎలమంచిలి, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి సమీపంలో జాతీయ రహదారి పక్కన రెండున్నరేళ్ల క్రితం జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఇక్కడ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌ వెల్లడించారు.

ఎలమంచిలి సమీపంలో జాతీయ రహదారి పక్కన బీపీసీఎల్‌ పెట్రోలు బంకు సమీపంలో గుర్తు తెలియని ఒక మృతదేహం కాలిపోయిన స్థితిలో వున్నట్టు 2023 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులకు సమాచారం వచ్చింది. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎటువంటి ఆనవాళ్లు లభించకపోవడంతో తొలుత హిజ్రాగా భావించి కేసు దర్యాప్తును కొనసాగించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో వృద్ధురాలి వద్ద వుంటున్న ఆమె మనవరాలు ఎల్లబిల్లి దివ్య (20) అదృశ్యమైనట్టు సమాచారం రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈమె సొంతూరు అచ్యుతాపురం మండలం పూడిమడక అని, తల్లి లేకపోవడం, తండ్రి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండడంతో అనకాపల్లిలో అమ్మమ్మ వద్ద పెరుగుతున్నట్టు గుర్తించారు. గురుకుల పాఠశాలలో ఇంటర్‌ వరకు చదివి, అనంతరం ఖాళీగా వున్నట్టు సమాచారం సేకరించారు. అయితే యువతిని ఎవరు హత్య చేస్తారన్నదానిపై ఆధారాలు లభించలేదు. దీంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఎలమంచిలి పట్టణానికి చెందిన ముగ్గురు యువకుల పాత్ర వున్నట్టు ఆధారాలు సేకరించారు. ఎలమంచిలిలోని సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ, ధర్మవరం వీధికి చెందిన సెలంశెట్టి సాయికృష్ణ , కాకివానివీధికి చెందిన బంగారి శివలను ఈ నెల 29వ తేదీన అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేరం అంగీకరించినట్టు తెలిసింది. ఎల్లబిల్లి దివ్యకు పలువురితో ‘పరిచయం’ వుందని, తనతో శారీరక సంబంధం ఏర్పరచుకుందని, పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఇంటికి వచ్చిగొడవ చేస్తానని బెదిరించిందని నిందితుల్లో ఒకరైన ప్రగడ రవితేజ చెప్పినట్టు తెలిసింది. అప్పటికే తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమెతో పెళ్లి చెడిపోతుందేమోనన్న భయంతో దివ్యను అంతమొందించాలని నిర్ణయించున్నట్టు చెప్పాడు. తన స్నేహితులు సెలంశెట్టి సాయికృష్ణ, కా బంగారి శివల సహకారంతో దివ్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చినట్టు అంగీకరించాడు. రవితేజ, సాయికృష్ణలపై ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో గంజాయి కేసు నమోదై ఉందని, బంగారి శివపై కొట్లాట కేసు ఉందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్‌ఐ సావిత్రి, మునగపాక ఎస్‌ఐ ప్రసాద్‌, ట్రైనీ డీఎస్పీని ఆయన అభినందించారు.

Updated Date - May 31 , 2025 | 12:55 AM