ముసురు.. మోస్తరు వర్షం
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:30 AM
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెం, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, మునగపాక మండలాల్లో తేలకపాటి జల్లులు పడ్డాయి. శుక్రవారం రాత్రి కూడా దఫదఫాలుగా జల్లులు పడుతూనే వున్నాయి.
నిండిన కల్యాణపులోవ, పెద్దేరు
గేట్లు ఎత్తి నదుల్లోకి నీరు విడుదల
అనకాపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెం, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, మునగపాక మండలాల్లో తేలకపాటి జల్లులు పడ్డాయి. శుక్రవారం రాత్రి కూడా దఫదఫాలుగా జల్లులు పడుతూనే వున్నాయి.
భారీ వర్ష సూచన..కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
బంగాళాఖాతంలో నెలకొన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో రానున్న రెండు రోజులు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08924-222888, 08924-225999, 08924-226599 నంబర్లకు (ల్యాండ్ లైన్లు) ఫోన్ చేయాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
కల్యాణపులోవ గేట్లు ఎత్తివేత
రావికమతం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెండు గేట్లు ఎత్తి అదనపు నీటిని సర్పా నదిలోకి విడిచిపెడుతున్నారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులు కాగా, పరీవాహక ప్రాంతమైన ఏజెన్సీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో 300 క్యూసెక్కుల వదర నీరు వచ్చి చేరుతున్నది. దీంతో శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 458.5 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో రెండు స్పిల్‌వేట్లను ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఏడీ డి.సూర్య తెలిపారు. అందువల్ల సర్పా నది పక్కనున్న రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లో చీమలపాడు, జడ్.కొత్తపట్నం, గంపవానిపాలెం, కొత్తకోట, కన్నంపేట, జగ్గంపేట, జె.నాయుడుపాలెం, కొమరవోలు, ఆర్.కొత్తూరు, కుసర్లపూడి, తూటిపాల, తాడపాల, కొండ అగ్రహారం గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
పెద్దేరు నుంచి 300 క్యూసెక్కులు..
మాడుగుల రూరల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్దేరు జలాశయంలోని వరద ప్రవాహం శుక్రవారం కూడా కొనసాగింది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లుకాగా ఎగువనున్న ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో 370 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 136.4 మీటర్లకు చేరింది. ముందు జాగ్రత్త చర్యగా రాత్రి ఎనిమిది గంటలకు మూడో నంబరు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నట్టు జలాశయం ఏఈ సుధాకరరెడ్డి చెప్పారు. పెద్దేరు నది పక్కన వున్న మాడుగుల, బుచ్చెయ్యపేట, చోడవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.