టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:54 PM
పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
వంద రోజులు ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచన
పాడేరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు, వంద రోజుల విద్యా ప్రణాళిక అమలుపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. విద్యార్థులను మరింతగా పదును పెట్టేందుకు ఉద్దేశించిన వంద రోజుల విద్యా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. అందుకు ఎంఈవోలు, హెచ్‌ఎంలు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వంద రోజుల విద్యా ప్రణాళిక అమలుపై ఐటీడీఏలోని మోనటరింగ్ సెల్ ద్వారా ఏపీవోలు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. విద్యలో వెనుకబాటుకు గురైన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి, వారిని ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో కె.రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ, ఎంఈవోలు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, తదితరులు పాల్గొన్నారు.