Share News

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:34 PM

ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యా సంస్థల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు.

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ఇప్పటి నుంచి ప్రత్యేక కార్యాచరణ అమలు

విద్యా శాఖ అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యా సంస్థల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్టు, వసతిగృహాల అధికారులతో పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి కూడా మధ్యలో చదువు మానేకూడదన్నారు. ప్రతి తరగతికి సంబంధించి విద్యార్థు తల్లిదండ్రులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయాలని, అందులో విద్యార్థుల గైర్హాజరు, రోజు వారీ అసైన్‌మెంట్‌, హోం వర్కు వివరాలను పొందుపరచాలన్నారు. వరుసగా మూడు రోజులకు మించి విద్యార్థి హాజరుకాకపోతే వెంటనే తల్లిదండ్రులను సంప్రదించాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో డ్రాపౌట్స్‌ ఎక్కువగా వుంటున్నాయని, ఇందుకుగల కారణాలను తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలపై సమాచారం వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వలస కార్మికులు/ కూలీల కుటుంబాలకు చెందిన విద్యార్థులను వసతిగృహాల్లో చేర్చుకోవాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో శక్తి క్లబ్‌ను ఏర్పాటు చేయాలని, వీటిద్వారా బాలల హక్కులు, పోక్సో చట్టం, మంచి-చెడు స్పర్శల తేడాలు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులను సెల్‌ఫోన్ల్‌తో పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతించవద్దని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:34 PM