రైలులో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:18 AM
రైలులో పురిటి నొప్పులతో బాధపడిన ఓ మహిళ విశాఖ స్టేషన్‌లో సిబ్బంది సురక్షితంగా దించి అత్యవసర వైద్య సేవలందించడంతో ఆడ శిశువును ప్రసవించింది.
విశాఖ స్టేషన్‌లో దించి అత్యవసర వైద్యం అందించిన రైల్వే డాక్టర్, సిబ్బంది
అంబులెన్స్‌లో ప్రసవం...ఆడ శిశువు జననం
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
రైలులో పురిటి నొప్పులతో బాధపడిన ఓ మహిళ విశాఖ స్టేషన్‌లో సిబ్బంది సురక్షితంగా దించి అత్యవసర వైద్య సేవలందించడంతో ఆడ శిశువును ప్రసవించింది. గురువారం ఎర్నాకులం-హటియా ఎక్స్‌ప్రెస్ (22838)లో ప్రయాణిస్తున్న గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతోపాటు రక్తస్రావం అవుతున్నట్టు సమాచారం అందుకున్న విశాఖ రైల్వే సిబ్బంది, డాక్టర్ భాషిణి ప్రియాంక అప్రమత్తమయ్యారు. రాత్రి 11.40 గంటల సమయంలో రైలు విశాఖకు చేరుకోగానే గేట్-1 వద్ద సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లోకి తరలించారు. అప్పటికే నొప్పులు, రక్తస్రావం ఎక్కువ కావడంతో డాక్టర్ భాషిణి ప్రియాంక, వైద్య సిబ్బంది అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవాన్ని విజయవంతంగా చేయించగలిగారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్న నేపథ్యంలో వారిని తదుపరి చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి సాధారణ ప్రసవం చేయడంతోపాటు తల్లీబిడ్డలను కాపాడేలా సేవలందించిన డాక్టర్ భాషిణి ప్రియాంక బృందాన్ని వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా అభినందించారు.