Share News

గిరిజనుడి హత్య

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:10 PM

ఇంటి స్థలం కోసం ఇద్దరు గిరిజనుల మధ్య వివాదం పెరిగి ఒకరు హత్యకు గురైన సంఘటన మండలంలోని గడుతూరు పంచాయతీ బొప్పంపాడులో ఆదివారం చోటుచేసుకుంది.

గిరిజనుడి హత్య
గెమ్మెలి సత్తిబాబు మృతదేహం

ఇంటి స్థలంపై వివాదం

ఇద్దరి మధ్య ఘర్షణ

కర్రతో భార్యాభర్తలపై దాడి చేసి నిందితుడు పరారీ

భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

జి.మాడుగుల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలం కోసం ఇద్దరు గిరిజనుల మధ్య వివాదం పెరిగి ఒకరు హత్యకు గురైన సంఘటన మండలంలోని గడుతూరు పంచాయతీ బొప్పంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని గెమ్మెలి సత్తిబాబు, పాంగి రాంప్రసాద్‌కు ఇటీవల ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఇల్లు నిర్మించబోయే స్థలం విషయంలో గతం నుంచి ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో పాంగి రాంప్రసాద్‌ ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. దీంతో గెమ్మెలి సత్తిబాబు అభ్యంతరం తెలిపాడు. ఈ స్థలం తనదని వాదించాడు. ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన పాంగి రాంప్రసాద్‌ పక్కనున్న కర్రతో గెమ్మెలి సత్తిబాబు(59) తలపై బలంగా కొట్టాడు. దీంతో సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన సత్తిబాబు భార్య నీలమ్మను కూడా కర్రతో కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం రాంప్రసాద్‌ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్‌ఐ షణ్ముఖరావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన నీలమ్మను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. సత్తిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సుమంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 11:10 PM