యాంత్రీకరణతో ఎంతో మేలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:29 AM
యువతను వ్యవసాయం వైపు మళ్లించడానికి, కూలీల కొరత తగ్గించడానికి యాంత్రీకరణ ఏకైక మార్గమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్రీకరణ మేళాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ప్రారంభించారు.
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- ఘనంగా యాంత్రీకరణ మేళా ప్రారంభం
నర్సీపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): యువతను వ్యవసాయం వైపు మళ్లించడానికి, కూలీల కొరత తగ్గించడానికి యాంత్రీకరణ ఏకైక మార్గమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్రీకరణ మేళాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ప్రారంభించారు. అనంతరం స్టాల్స్‌లో వరికోత, దుక్కుదున్నె వ్యవసాయ యంత్ర పనిముట్లు, ట్రాక్టర్లును సందర్శించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. నేటి యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించడానికి యాంత్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక యంత్రాలను ఉపయోగించుకొని వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. కిసాన్ డ్రోన్ పథకంలో వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్ రూ.8 లక్షలు ప్రభుత్వ రాయితీతో అందిస్తున్నామని తెలిపారు. యువత ఇటువంటి పనిముట్లు తీసుకొని స్వయం ఉపాధి పొందవచ్చునన్నారు. కూలీల కొరత అధిగమించడానికి, వ్యవసాయం ఖర్చు తగ్గించుకోవడానికి ఇటువంటి యంత్ర పనిముట్లు ఉపయోగపడతాయన్నారు. తాండవ, రావణాపల్లి రిజర్వాయర్లకు మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి శీతల గిడ్డంగిని ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరానికి వ్యవసాయరంగంలో నర్సీపట్నం నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని సూచించారు. యాంత్రీకరణకు ప్రభుత్వం రాయితీగా ఇచ్చిన రూ.2.51 కోట్లు చెక్కు నమూనాలు అందజేశారు. మినీ ట్రాక్టర్‌ను స్పీకర్ నడిపి దాని పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఐదు ఎకరాలలో అరటి, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న గైరంపేటకి చెందిన యువ రైతు శివగణేశ్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ కన్నయ్యనాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు సుకలరమణమ్మ, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన ఇన్‌చార్జ్ సూర్యచంద్ర, జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు, ఏడీ శ్రీదేవి, పశుసంవర్థక శాఖ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.