ఎంటీఎస్ టీచర్ల ఆందోళన
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:49 AM
మైదాన ప్రాంతాల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలంటూ మినిమిమ్ టైమ్‌స్కేలుతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మైదాన ప్రాంతంలో పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్
రెండేళ్లు ఏజెన్సీలోనే పనిచేశామని ఆవేదన
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఖాళీలు లేవన్న విద్యాశాఖ
అధికారుల తీరుకు నిరసనగా డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన
బదిలీల కౌన్సెలింగ్ వాయిదా
విశాఖపట్నం/ఆరిలోవ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
మైదాన ప్రాంతాల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలంటూ మినిమిమ్ టైమ్‌స్కేలుతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏజెన్సీలో ఉన్న ఎస్జీటీ ఖాళీల్లో తమను నియమించాలన్న విద్యాశాఖ అధికారుల నిర్ణయాన్ని గుర్తించిన వారంతా కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు.
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఎంటీఎస్ టీచర్లకు పోస్టింగ్స్ ఇస్తారు. అయితే ఈ ఏడాది రెగ్యులర్ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించిన విద్యాశాఖ, చివరగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఆదివారం కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ ఇచ్చింది. ప్రాంతీయ విద్యాశాఖ డైరెక్టర్ విజయభాస్కర్, విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో విశాఖ వ్యాలీ స్కూలులో ఆదివారం ఉదయం పదిగంటలకు 2008 డీఎస్సీకి చెందిన 185 మంది, మధ్యాహ్నం రెండుగంటలకు 1998 డీఎస్సీకి చెందిన 249 వెరసి 426 మంది ఎంటీఎస్ టీచర్లకు విద్యాశాఖ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఏజెన్సీలోనే ఖాళాలు
ఇటీవల ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించిన తరువాత ఉమ్మడి విశాఖ జిల్లాలో 760 ఖాళీలు మిగిలాయి. వీటిలో 742 ఖాళీలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉండగా మైదాన ప్రాంతమైన అనకాపల్లి, విశాఖ జిల్లాలో కేవలం 18 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎంటీఎస్ టీచర్లు విధిగా ఏజెన్సీలోని పాఠశాలలకు వెళ్లాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.దీంతో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగి, విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు 2023లో తొలిసారిగా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు చాలామందికి ఏజెన్సీలోనే పోస్టింగ్స్ వచ్చాయని, అప్పటి నుంచి అక్కడే పనిచేశామని, మళ్లీ ఏజెన్సీకి వెళ్లాలనడం భావ్యంకాదని వాపోయారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటుచేసిన 220 క్లస్టర్లకు తమను అటాచ్ చేస్తూ పోస్టింగ్స్ ఇవ్వాలని, అప్పటికీ మిగిలిన వారిని ఏజెన్సీకి పంపాలని కోరారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమను 2023లో కేవలం సహాయక టీచర్లుగా పరిగణించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీకి వెళ్లాలనే విద్యాశాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సెలింగ్‌కు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఎంటీఎస్ టీచర్లకు పీఆర్‌టీయూ నాయకుడు గోపీనాథ్, ఎస్టీయూ అనకాపల్లి నేతలు పరదేశి, గంగాధర్ తదితరులు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. కాగా కౌన్సెలింగ్‌కు ఎంటీఎస్ టీచర్లు హాజరుకాలేదని డీఈవో ప్రేమ్‌కుమార్ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో మాత్రమే ఖాళీలున్నాయని అందువల్ల ఎంటీఎస్ టీచర్లంతా అక్కడికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు. విధుల్లో చేరకపోతే జీతాలు బట్వాడా చేయలేమన్నారు.