Share News

హెల్త్‌సిటీ సమీపాన ఎంఎస్‌ఎంఈ పార్క్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:50 AM

నగరంలోని ఆరిలోవ హెల్త్‌ సిటీ సమీపాన రెండు ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

హెల్త్‌సిటీ సమీపాన ఎంఎస్‌ఎంఈ పార్క్‌

  • భీమిలి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం

  • మలి దశలో విజయనగరం వరకూ మెట్రో రైలు

  • ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ఆరిలోవ హెల్త్‌ సిటీ సమీపాన రెండు ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్ట్రన్‌ ఎరీనాలో శుక్రవారం నిర్వహించిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నియోజకవర్గానికొకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుచేస్తామన్నారని, అది ఎంతవరకూ వచ్చిందని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రశ్నించగా...తొలి దశలో 50 పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే 11 పార్కులు ప్రారంభమయ్యాయని, వాటిలో 300 ప్లాట్లు వివిధ పరిశ్రమలకు కేటాయించామన్నారు. మరో 30 పార్కుల పనులు ప్రారంభమయ్యాయన్నారు. వచ్చే నెలలో మరో 40 పార్కులు గ్రౌండింగ్‌ చేస్తామన్నారు.

విశాఖ జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో ఒక పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి హెల్త్‌ సిటీ సమీపాన రెండు ఎకరాలు తీసుకుంటున్నామన్నారు. అమెరికా పౌరులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అంటూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఏపీపై ఎంతవరకు ఉంటుందని ప్రశ్నించగా, దానిని పాజిటివ్‌గా తీసుకోవాలని మంత్రి సూచించారు. అమెరికా ఒక్కటే ఉద్యోగాలు ఇవ్వదని, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయని, టెక్నాలజీలో ఏపీ అగ్రస్థానాన ఉందని, ఏఐలో కూడా టాప్‌లో ఉన్నామని, ఆయా దేశాలే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయన్నారు. విశాఖ మెట్రో రైలు కారిడార్‌ తొలి దశ ఇప్పుడు ప్రారంభమవుతుందని, మలి దశలో భోగాపురం విమానాశ్రయం వరకూ వేస్తారన్నారు. అదేవిధంగా విజయనగరం వైపు కూడా కనెక్టివిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడును కోరామని, రెండు నగరాలు దాదాపుగా కలిసి పోతున్నందున అది కూడా అవసరమన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:50 AM