Share News

‘మాకవరపాలెం’లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:19 AM

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ఎంఎస్‌ఎంఈ పార్కును మాకవరపాలెం మండలంలో ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఈ మేరకు అధికార కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని రామన్నపాలెం వున్న ఏపీఐఐసీ భూములను రెవెన్యూ అధికారులతో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌.. తాజాగా జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పరిశీలించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది.

‘మాకవరపాలెం’లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌
ఎంఎస్‌ఎంఈ ఏర్పాటుకు ప్రభుత్వం పరిశీలిస్తున్న మాకవరపాలెం మండలం రామన్నపాలెంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములు

రామన్నపాలెంలోని ఏపీఐఐసీ భూములు పరిశీలన

అందుబాటులో సుమారు 300 ఎకరాలు

కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదిక

క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయకృష్ణన్‌

యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి

సీఎం చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేస్తారంటున్న టీడీపీ నేతలు

మాకవరపాలెం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ఎంఎస్‌ఎంఈ పార్కును మాకవరపాలెం మండలంలో ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఈ మేరకు అధికార కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని రామన్నపాలెం వున్న ఏపీఐఐసీ భూములను రెవెన్యూ అధికారులతో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌.. తాజాగా జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పరిశీలించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది.

మాకవరపాలెం మండలంలో అల్యూమినియం కంపెనీ నిర్మాణం కోసం 2007వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2,450 ఎకరాలను సేకరించింది. అయితే ఇందులో సుమారు రెండు వేల ఎకరాలను మాత్రమే అల్యూమినియం కంపెనీ తీసుకుంది. మిగిలిన భూమి ఏపీఐఐసీ ఆధీనంలోనే ఉంది. ఈ భూమి రాచపల్లి రెవెన్యూ పరిధి రామన్నపాలెం, వెంకయ్యపాలెం, ఎరకన్నపాలెం, చినరాచపల్లి గ్రామాలను అనుకొని ఉంది. రామన్నపాలెంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న సుమారు 300 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే నాడు ప్రతిపక్షంలో వున్న వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేసి ఆ పరిశ్రమ రాకుండా అడ్డుకున్నారు. గత ఏడాది తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా వున్న కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడ ఖాళీగా వున్న ఏపీఐఐసీ భూములను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని భావించినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు.. నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించారు. ఈ భూములను శనివారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పరిశీలించారు. ఏపీఐఐసీ ఆధీనంలో వున్న ఈ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా వున్నట్టు చెప్పారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఏర్పాటైతే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:19 AM