చింతపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:46 AM
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనుక ఏపీఐఐసీ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
15 ఎకరాల్లో ఓంశాంతి ఆధ్యాత్మిక పర్యాటకం
ఈఎంఆర్ పాఠశాల విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షలు
డిసెంబరు నాటికి మ్యూజియం పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
చింతపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనుక ఏపీఐఐసీ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత రూ.78.3 లక్షల పీఎం జన్‌మన్ నిధులతో బెన్నవరం నుంచి బొంకమామిడి వరకు 1.5 కిలోమీటర్లు రహదారి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వెనుకనున్న ఇండస్ట్రీయల్ పార్కు, ఆధ్యాత్మిక పర్యాటకం నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అలాగే చుంచుంపూడి గ్రామంలో ఉన్న ఈఎంఆర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈఎంఆర్ పాఠశాల బేస్ లైన్ పరీక్షలు జరగలేదని విద్యార్థులు చెప్పారు. దీంతో వెంటనే గురుకులం ఓఎస్‌డీతో ఫోన్‌లో మాట్లాడి బేస్ లైన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మడిగుంట గ్రామంలో పీఎం జన్‌మన్‌తో నిర్మంచిన అంగన్‌వాడీ నూతన భవనాన్ని పరిశీలించారు. భవనానికి విద్యుత్ సదుపాయం కల్పించేందుకు నిధులు సరిపడకపోవడం వలన మండల పరిషత్ నుంచి రూ.50 వేలు సమకూర్చాలని ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మిని ఆదేశించారు. లంబసింగిలో నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. డిసెంబరు నాటికి మ్యూజియం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్.. కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, పనులు పూర్తి చేస్తే బిల్లులు వెంటనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. అనంతరం కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లిలో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వెనుకనున్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించామన్నారు. అలాగే ఇండస్ట్రీయల్ పార్కు పక్కనే ఓంశాంతి నిర్వాహకులు ఆధ్యాత్మిక పర్యాటక ఉద్యానవనం ఏర్పాటు చేసేందుకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఆధ్యాత్మిక పర్యాటక ఉద్యానవనంలో ఆధ్యాత్మిక క్షేత్రం, మెడిటేషన్ కేంద్రం, స్కూల్, ఆస్పత్రి ఏర్పాటు చేస్తారన్నారు. అలాగే పీఎం జన్‌మన్ పథకం ద్వారా నిర్మిస్తున్న భవనాలు, రహదారుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె.శంకరరావు, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, పీఆర్ ప్రాజెక్డు డీఈఈ డి.సురేశ్ రెడ్డి, ఏఈఈ వి.వెంకటేశ్, పీఆర్ ఏఈఈ బాలకిశోర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ గడుతూరి స్వర్ణలత, టీడబ్ల్యూ డిఈఈ రాఘునాథరావునాయుడు, ఏఈఈ యాదకిశోర్, ఎస్‌ఎంఐ ఏఈఈ లోకేశ్, ఈఎంఆర్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.