Share News

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:03 PM

మన్యంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అధిక సంఖ్యలో మరమ్మతులకు గురై మూలకు చేయడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైన బాలింతలు ఆటోలు, బైకులపై తమ స్వగ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ
పాడేరు ఆస్పత్రిలో మరమ్మతులకు గురై మూలకు చేరిన పాడేరు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం

ఏజెన్సీ వ్యాప్తంగా 23 వాహనాలకు గానూ 11 మూలకు చేరిన వైనం

నిర్వహణ సంస్థ పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి

ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు వెళ్లడానికి బాలింతల అవస్థలు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గిరిజనుల వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అధిక సంఖ్యలో మరమ్మతులకు గురై మూలకు చేయడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైన బాలింతలు ఆటోలు, బైకులపై తమ స్వగ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

మన్యంలో మొత్తం 23 వాహనాలకు గానూ ప్రస్తుతం 11 మరమ్మతులకు గురై మూలకు చేరాయి. వాటిని నిర్వహిస్తున్న సంస్థ పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. వాస్తవానికి ఆస్పత్రుల్లో ప్రసవించిన వారు తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఎంతగానో ఉపయోగపడేవి. అయితే గత కొన్నాళ్లుగా వాటి నిర్వహణను సదరు సంస్థ నిర్లక్ష్యం చేస్తుండడంతో మరమ్మతులకు గురైన వాహనాలు మూలకు చేరాయి. కొన్ని సందర్భాల్లో చిన్న మరమ్మతులను సిబ్బంది సొంత డబ్బులతో చేయించి వాటిని నడిపిస్తున్నారు. అయితే వాటి నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో పెద్ద మరమ్మతులకు గురైన వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంటున్నది. దీంతో చేసేది లేక సిబ్బంది మిన్నకుంటున్నారు. ఈ క్రమంలో బాలింతల బంధువులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందితో ఘర్షణలు పడుతున్న సందర్భాలు నిత్యకృత్యమయ్యాయి.

స్వగ్రామాలకు వెళ్లేందుకు బాలింతల అవస్థలు

ఏజెన్సీలోని సగానికి పైగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు మూలకు చేరడంతో ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు అందుబాటులో ఉండేటప్పుడు ఆస్పత్రి సిబ్బంది తల్లీబిడ్డను వాహనాల్లోనే వారి ఇళ్లకు పంపించేవారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాడేరులోని జిల్లా ఆస్పత్రిలో మొత్తం మూడు వాహనాలకు గానూ ఒకటి మూలకు చేరగా, రెండు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జి.మాడుగుల, హుకుంపేటకు చెందిన రెండు వాహనాలు మరమ్మతులకు గురై పాడేరు ఆస్పత్రి ముందే దిష్టిబొమ్మల్లా ఉన్నాయి. జి.మాడుగులకు చెందిన మరో వాహనం సైతం పాడైపోయి పాడేరు ఆస్పత్రిలోనే ఆగిపోయింది. ముంచంగిపుట్టు, చింతపల్లిలోని రెండేసి వాహనాలకు ఒక్కొక్కటి మాత్రమే పని చేస్తుండగా, అరకులోయ, ధారకొండ, కొయ్యూరు, లోతుగెడ్డ, హుకుంపేటలో ఒక్కొక్క వాహనం ఉండగా, అవన్నీ గత కొన్నాళ్లుగా మూలకు చేరాయి. దీంతో ఆస్పత్రిలో ప్రసవమైన బాలింతలు ఆటోలు, బైకులపై తమ స్వగ్రామాలకు తరలివెళుతున్నారు. ఏజెన్సీలో మరమ్మతులకు గురైన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేకుంటే కనీసం ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న గిరిజన ప్రాంతంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు పాడైపోవడంతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నెలలుగా సిబ్బందికి అందని జీతాలు

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల్లో పని చేస్తున్న సిబ్బంది(ఫైలట్‌)కి గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఒక్కో పైలట్‌కు నెలకు కేవలం రూ.7,870 మాత్రమే వేతనం, దానిని సైతం నెలల తరబడి ఇవ్వకపోవడంతో కుటుంబాలతో జీవనానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా వాహనాలకు చిన్న మరమ్మతులు వస్తే తమ సొంత డబ్బులతోనే బాగు చేయిస్తున్నారు. అయితే తమ ఇబ్బందులు, వాహనాల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సిబ్బంది వేతనాల సమస్య, వాహనాల మరమ్మతులకు చర్యలు చేపట్టి బాలింతల కష్టాలు తీర్చాలని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాఽధాకృష్ణ డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:03 PM