బిడ్డతో తల్లి ఆత్మహత్యా యత్నం
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:43 PM
మండలంలోని రావణాపల్లిలో ఆదివారం సాయంత్రం బిడ్డతో కలిసి తల్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో బిడ్డ మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్య సేవలందించేందుకు తల్లిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
బిడ్డ మృతి.. తల్లి పరిస్థితి విషమం
విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
భర్తతో స్పల్ప వాదనే కారణం
కొయ్యూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రావణాపల్లి గ్రామానికి చెందిన లువ్వా సతీష్, కొయ్యూరుకు చెందిన మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీశ్ ఆటో నడుపుతుండగా.. మౌనిక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల లాస్యశ్రీ అనే కుమార్తె ఉంది. ఆదివారం ఒక శుభకార్యానికి భార్యాభర్తలు వెళ్లి వచ్చాక ఇద్దరి మధ్య స్వల్ప వాదన జరిగింది. దీంతో విసుగు చెందిన మౌనిక (25) అమ్మేందుకు తెచ్చిన పెట్రోల్ బాటిల్ తీసుకొని కూతురితో పాటు సమీపంలోని జీడి తోటలోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో మంటల వేడికి లాస్యశ్రీ అక్కడే పడిపోగా, మౌనిక వేడిని తట్టుకో లేక సమీప కొండవాగు గుమ్మిలో దూకింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న లాస్యశ్రీని అంబులెన్సులో వైద్య సేవల నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మౌనిక కోసం వెతకగా గుమ్మిలో కాలిన గాయాలతో కనిపించింది. ఆ వెంటనే ఆమెను గ్రామస్థులు ఆటోలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ కుమార్తె లాస్యశ్రీ మరణించింది. తల్లి మౌనికను మెరుగైన వైద్య సేవల నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.