Share News

మరింతగా సేంద్రీయ సాగు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:40 AM

గిరిజన రైతులు సేంద్రీయ సాగును మరింతగా పెంచాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు.

మరింతగా సేంద్రీయ సాగు
పాడేరు మండలం తుంపాడలో రైతులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

రైతులకు ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ సూచన

పాడేరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు సేంద్రీయ సాగును మరింతగా పెంచాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె మండలంలోని తుంపాడ గ్రామంలో రైతులతో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో పాటు చక్కని దిగుబడులు సాధించేందుకు గిరిజన రైతులు ప్రకృతి సేద్యాన్ని మరింతగా అలవాటు చేసుకోవాలన్నారు. సేంద్రీయ ఉత్పత్తులకు గిరాకీ ఉందని, రైతులకు వాటి ద్వారా చక్కని ఆదాయం లభిస్తుందని చెప్పారు. అలాగే గిరిజన రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయంలో మరింతగా రాణించాలన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి ప్రభుత్వపరంగా అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో సాగునీటి సమస్య ఉందని తుంపాడ వాసులు తెలపగా, ఆమె సానుకూలంగా స్పందించారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి జరుగుతున్న మార్పులు, ఈ క్రమంలో రైతులు చేపట్టాల్సిన చర్యలపై శ్రీపూజ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, వ్యవసాయ, ఉద్యానవనాధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:40 AM