Share News

మరింత సమర్థంగా ఆహార భద్రతా విభాగం

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:22 AM

ఆహార భద్రతా విభాగం మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తాం. ఇందుకోసం తగిన సూచనలు చేస్తూ పక్షం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం’ అని శాసనసభా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌, ఉప సభాపతి కె.రఘురామకృష్ణరాజు అన్నారు.

మరింత సమర్థంగా   ఆహార భద్రతా విభాగం
సమీక్ష సమావేశంలో శాసనసభా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌ కె.రఘురామకృష్ణరాజు, సభ్యులు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

పక్షం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక

సిబ్బంది కొరతను అధిగమించేందుకు

సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవచ్చు

ఆహార భద్రతలో ఏపీది 29వ స్థానం

శాసనసభా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌ కె.రఘురామకృష్ణరాజు

విశాఖపట్నం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ఆహార భద్రతా విభాగం మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తాం. ఇందుకోసం తగిన సూచనలు చేస్తూ పక్షం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం’ అని శాసనసభా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌, ఉప సభాపతి కె.రఘురామకృష్ణరాజు అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం కమిటీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆహార భద్రతా విభాగానికి సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. విభాగంలో 500 మందికిగాను 54 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవచ్చు. దీనిపై ప్రభుత్వానికి సూచన చేస్తాం. సుమారు 200 నుంచి 250 మంది సచివాలయ ఉద్యోగులను ఆహార భద్రతా విభాగానికి తీసుకుంటే కొంతవరకు కొరతను అధిగమించవచ్చు. దీనికి మా కమిటీ మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. నాలుగు నెలల్లో ఈ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో ల్యాబ్‌ల కొరత కూడా ఉంది. విశాఖపట్నంలో ఏడాది క్రితం ప్రారంభించిన లేబొరేటరీలో పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది లేరని అధికారులు మాకు వివరించారు. నవంబరు తొలి వారం నుంచి విశాఖ ఫుడ్‌ లేబొరేటరీలో పరీక్షలు నిర్వహించేలా చూస్తాం. ఆహార భద్రత విషయంలో దేశంలో ఏపీ 29వ స్థానంలో ఉంది. ఆహార కల్తీ ఎక్కువగా ఉంది. ఈ విభాగంపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో సమీక్షించాం. ఆహారంలో రంగుల వినియోగంపై ప్రజలను అప్రమత్తం చేయాలని విభాగాన్ని ఆదేశించాం’ అని రఘురామ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఫిర్యాదుల కమిటీ సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పి.విష్ణుకుమార్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా విభాగం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - Oct 23 , 2025 | 01:22 AM