పట్నం కోర్టుకు మరింత వసతి
ABN , Publish Date - May 27 , 2025 | 01:47 AM
నర్సీపట్నంలో కోర్టు సముదాయం అదనపు భవనాల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
రూ.3.09 కోట్లతో అదనపు భవన సముదాయం
పరిపాలన అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియ
ప్రస్తుత భవనంపై మరో అంతస్థు నిర్మాణం
నర్సీపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నంలో కోర్టు సముదాయం అదనపు భవనాల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3.09 కోట్లు మంజూరు చేసింది. త్వరలో పరిపాలన అనుమతులు వచ్చి, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంటున్నారు. నర్సీపట్నంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు ప్రతిపాదనలు ఉండడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మించునున్నట్టు తెలిసింది. ఉమ్మడి విశాఖ జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు ఇటీవల స్థానిక కోర్టు సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు చేశారు.
నర్సీపట్నం కోర్టు సముదాయం గతంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉండేది. పురాతన భవనాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆనుకొని కొత్త భవన సముదాయం నిర్మించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణ నుంచి కోర్టు సముదాయాన్ని అక్కడకు తరలించారు. ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్‌జూనియర్ సివిల్ జడ్జి, అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులు నడుస్తున్నాయి. అయితే గతంలో నిర్మించిన భవన సముదాయం చాలకపోవడంతో అదనపు భవనాల నిర్మాణాకి మూడేళ్ల క్రితం రూ.2.3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పరిపాలన అనుమతులు వచ్చి, టెండర్లు పిలిచారు. కానీ బిడ్లు దాఖలు చేయడానికి కాంటాక్టర్లు ముందుకు రాలేదు. న్యాయస్థానాలకు అదనపు వసతి సమకూరలేదు. గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, శాసనసభ స్పీకర్ అయిన అయ్యన్నపాత్రుడు.. కోర్టు సముదాయం అదనపు భవనాల నిర్మాణానికి గట్టిగా కృషి చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు ఇటీవల అంచనాలు రూపొందించారు. ప్రస్తుత రేట్ల ప్రకారం నిర్మాణ వ్యయాన్ని రూ.3.09 కోట్లకు పెంచారు. ఆర్థిక శాఖ నుంచి పరిపాలన పరమైన ఆమోదం వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న కోర్టు సముదాయం కింది అంతస్థులో పార్కింగ్, మొదటి అంతస్థులో కోర్టులు నిర్వహిస్తున్నారు. రూ.3.09 కోట్లతో రెండో అంతస్థు నిర్మిస్తారు. ఇందులో కొంతభాగంలో బ్యాంకు, పోస్టాఫీసు, క్యాంటీన్ వంటివి ఏర్పాటు చేస్తారు.