Share News

మొంథా ముసురు

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:34 AM

మొంథా తుఫాన్‌ విశాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు కొనసాగుతున్నాయి.

మొంథా ముసురు

  • కొనసాగుతున్న వర్షాలు

  • రహదారులపైకి నీరు

  • వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

  • ఈదురుగాలులకు నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

  • పడిపోయిన గోడలు.... పొంగిన డ్రైనేజీలు

  • అత్యధికంగా ఆనందపురంలో 21 సెం.మీ. వర్షపాతం నమోదు

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

మొంథా తుఫాన్‌ విశాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు కూలిపోతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. గోడలు పడిపోతున్నాయి. రహదారులపై మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఆనందపురంలో 21 సెం.మీ., మహారాణిపేటలో 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

కూలిన చెట్లు

నగరంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ అనంతరం కాలనీల్లో రహదారుల పక్కన ఎక్కువ సంఖ్యలో చెట్లు నాటారు. అవన్నీ ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం వీస్తున్న గాలులకు అవి వేళ్లతో సహా నేలకొరుగుతున్నాయి. గురుద్వారా నుంచి సీతమ్మధార వెళ్లే మార్గంలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. అలాగే ఏవీఎన్‌ కాలేజీ డౌన్‌లో కేజీహెచ్‌ గోడ కూలిపోయి ఆటో, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎంవీపీ కాలనీలోని 3, 5 సెక్టార్లలో చెట్లు కూలి ఇళ్లపై పడ్డాయి. కురుపాం టవర్స్‌ వద్ద ఒక చెట్టు విరిగి ప్రహరీపై పడింది. ఆర్‌సీడీ ఆస్పత్రి ఎదురుగా మరో చెట్టు కూలింది. ఏయూ, రైల్వే క్వార్టర్లలో చాలా చెట్లు పడిపోయాయి. ఇలా నగరంలో మొత్తం 130 వరకు చెట్లు కూలిపోయాయని అంచనా. వాటిలో 100 వరకు తొలగించగా, ఇంకా పనులు కొనసాగుతున్నాయి.

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

నగరంలో గెడ్డల పక్కన ఏర్పాటుచేసిన విద్యుత్‌ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఎనిమిది ప్రాంతాల్లో నేలకొరిగాయి. విశాఖ సర్కిల్‌ ఈపీడీసీఎల్‌ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు.

నానిపోయి పడిపోయిన గోడలు

నగరంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బలహీనంగా ఉన్న ప్రహరీ గోడలు నానిపోయి మంగళవారం పలు ప్రాంతాల్లో కూలిపోయాయి. టింపనీ స్కూల్‌ ప్రహరీ ఒకవైపు కూలిపోగా, అదే ప్రాంతంలో ఖాళీ స్థలం చుట్టూ నిర్మించిన గోడ పడిపోయింది. కేజీహెచ్‌ గోడ రెల్లివీధి వైపు కూలిపోయింది. కొండవాలు ప్రాంతాల్లో చాలాచోట్ల ఇళ్ల వెనుక నిర్మించుకున్న గోడలు పడిపోయాయి. ఇలా మొత్తం ఎనిమిదిచోట్ల గోడలు పడిపోయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. బీచ్‌రోడ్డులో సీతకొండ వద్ద బండరాళ్లు జారి పడడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్లి పరిశీలించారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఆర్‌కే బీచ్‌ నుంచి రుషికొండ వరకూ బీచ్‌లలోకి ఎవరూ వెళ్లకుండా 18 మంది లైఫ్‌ గార్డులను పెట్టారు. అయితే వారెవరికీ కనీసం రెయిన్‌ కోట్లు కూడా సమకూర్చలేదు. వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహించారు.

రైల్వేస్టేషన్‌ ఎదుట నిలిచిన నీటి సరఫరా

నగరంలో చాలాచోట్ల వరద నీరు రహదారులపై నిలిచిపోయింది. రైల్వేస్టేషన్‌ ఎదురుగా కార్నర్‌లో నీరు ప్రవహించే మార్గాలు మూసుకుపోవడంతో రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది. జీవీఎంసీ అధికారులు సిబ్బందిని రంగంలోకి దించి పనులు చేపట్టారు. వెలంపేట, కేఆర్‌ఎం కాలనీ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, చావులమదుం తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఇలా 30 ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోగా 20 చోట్ల అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు నిండిపోయి మ్యాన్‌హోళ్లు పైకి లేచిపోయి మురుగు రోడ్లపైకి వచ్చింది. ఇలా సుమారుగా 20 చోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు పైకి లేచాయి. వాటిలో పదింటిని సరిచేశారు. ఇంకా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది.

మల్కాపురం-సింధియా మార్గంలో నిలిచిన రాకపోకలు

మల్కాపురం-సింధియా మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి డివైడర్‌ కనిపించకుండా పోయింది. సుమారు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. నీరు పక్కనున్న ఏకేసీ కాలనీలోకి ప్రవేశించింది. సుమారు 400 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ దగ్గరుండి పనులు చేయించారు.

తొలగని ముప్పు

నేటి ఉదయం వరకూ భారీ వర్షసూచన

ఓడరేవుల్లో 9వ నంబర్‌ డేంజర్‌ సిగ్నల్స్‌

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ మంగళవారం రాత్రి మచిలీపట్నం-హంసలదీవి మధ్య తీరం దాటినప్పటికీ విశాఖపట్నం జిల్లాలో బుధవారం ఉదయం వరకూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉదయం ఎనిమిది నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు అత్యధికంగా ఆనందపురంలో 21, విశాఖ రూరల్‌లో 19, మహారాణిపేటలో 16, మధురవాడలో 15.6, హెచ్‌బీ కాలనీ, ఎండాడ, కాపులుప్పాడల్లో 15, స్వర్ణభారతి స్టేడియం వద్ద 14.5, దువ్వాడ, వేపగుంట, పెందుర్తిల్లో 14, గోపాలపట్నంలో 13.4, మధురవాడ, సాగర్‌నగర్‌లలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పద్మనాభంలో 5.3, అక్కిరెడ్డిపాలెం, గోస్తనీ పంపుహౌస్‌లో 5.2, వేపగుంటలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2018 సంవత్సరం (తితిలీ తుఫాన్‌ సమయాన) తరువాత మరోసారి విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం ఓడరేవుల్లో తొమ్మిదో నంబరు డేంజర్‌ సిగ్నల్స్‌ ఎగురవేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేడు విద్యా సంస్థలకు సెలవు

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ ప్రభావం విశాఖ జిల్లాపై కొనసాగుతున్నందున బుధవారం అన్ని యాజమాన్యాల పరిధిలో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మంగళవారం సాయంత్రం తెలిపారు. తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకుని సోమవారం, మంగళవారం విద్యా సంస్థలకు ముందే సెలవు ప్రకటించారు. వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో బుధవారం కూడా సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని, అత్యవసరం అయితే కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌కు (0891-2590100, 0891-2590102)కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.

భారీవాహనాల రాకపోకలపై ఆంక్షలు

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ ప్రభావంతో నగరంలో భారీవర్షాలు కురుస్తుండడంతో ముందుజాగ్రత్తగా భారీవాహనాల రాకపోకలపై సీపీ శంఖబ్రతబాగ్చి ఆంక్షలు విధించారు. తీవ్రతుఫాన్‌ కారణంగా జాతీయ రహదారితోపాటు నగరంలో ముంపుతీవ్రత ఎక్కువగా ఉన్న రోడ్లపై కంటెయినర్‌ వంటి భారీ వాహనాలను అనుమతించవద్దని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వరద నీరు రోడ్ల పైనుంచి ప్రవహిస్తుండడం, రోడ్ల మధ్యలో ఉండే వంతెనలపై ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల భారీవాహనాలు వెళితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం వుంటుంది కాబట్టి ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి నగరంలోకి వచ్చే భారీవాహనాలను జాతీయ రహదారి వెంబడి ఉన్న హోల్డింగ్‌ పాయింట్ల వద్ద నిలిపేస్తామని సీపీ తెలిపారు.

Updated Date - Oct 29 , 2025 | 12:34 AM