పెసా చట్టం అమలు తీరు పరిశీలన
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:57 PM
జిల్లాలో పెసా చట్టం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు చిలకలగెడ్డ, కాశీపట్నం, కొండిబలో పర్యటించారు.
తరలి వచ్చిన పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు
ఘనంగా చిలకలగెడ్డ, కాశీపట్నం, కొండిబలో పెసా మహోత్సవం
అనంతగిరి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెసా చట్టం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు చిలకలగెడ్డ, కాశీపట్నం, కొండిబలో పర్యటించారు. వారికి డ్వాక్రా మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు థింసా నృత్యాలతో స్వాగతం పలికారు. వారంతా ముందుగా చిలకలగెడ్డ, కాశీపట్నంలో నిర్వహించిన పెసా మహోత్సవంలో గిరిజనులు పండించిన రాజ్‌మా, సామలు, కొర్రాలు, తదితర వాటితో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. పెసా చట్టం గిరిజన ప్రాంతంలోని ఏ విధంగా అమలవుతోంది, దాని వలన గిరిజనులకు కలుగుతున్న లాభాలపై చిలకలగెడ్డ, కాశీపట్నంలోని గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పెసా చట్టం గిరిజనులకు రక్షణ కవచమని, గిరిజన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు సహజ వనరులను ఉపయోగించుకోవడం, గిరిజనులు దోపిడీ నుంచి విముక్తి కలిగించేలా ఈ చట్టం ఉందని వారికి గిరిజనులు వివరించారు. వెలుగు ద్వారా డ్వాక్రా మహిళలు పొందిన రుణాలను ఉపయోగించిన తీరును క్షుణ్ణంగా వివరించారు. జీవో నంబరు 3 రద్దు కావడంతో గిరిజనులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, వ్యవసాయ రంగానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని గ్రామపెద్దలు కోరారు. అనంతరం కొండిబలో స్థానిక గిరిజన మహిళలు ఆకులతో తయారుచేసిన టోపీలను వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు అందించగా వారు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, హిమచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కొండిబ, కాశీపట్నం సర్పంచులు పున్నమ్మ, లక్ష్మి, ఎంపీడీవో ప్రభాకర్, తహశీల్దార్ వీరభద్రాచారి, ఏపీఎం రమేశ్, కార్యదర్శులు శైలజ, బేగం, లేబర్ బోర్డు డైరెక్టర్ మోస్య జోగులు, కో ఆప్షన్ సభ్యుడు మదీనా, దయానిధి, మధుసూదన్, మూర్తి, పెసా అధ్యక్ష, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.