Share News

ఉత్సవాల పేరిట కాసుల వేట

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:58 AM

నగరంలో వినాయక ఉత్సవాలను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉత్సవాల పేరిట కాసుల వేట

  • ఆర్కే బీచ్‌ సమీపాన 14 ఎకరాల విస్తీర్ణంలో వినాయక ఉత్సవాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

  • 2 వేల కిలోల జర్మన్‌ సిల్వర్‌తో విగ్రహం...6 ఎకరాల్లో పార్కింగ్‌...

  • టికెట్‌ కొంటేనే దర్శనం...

  • లులూ మాల్‌కు కేటాయించిన స్థలంలో నిర్వహణ

విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

నగరంలో వినాయక ఉత్సవాలను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొన్ని వ్యాపార దృక్పథంతో చేస్తున్నవి కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణపతిలా ఇక్కడ ఉచిత దర్శనం ఉండదు. డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొంటేనే వినాయకుడిని చూడడానికి లోపలకు పంపుతారు. ఈ దోపిడీకి జిల్లా నాయకులు కొందరు వెన్నుదన్నుగా ఉండడం మరో విశేషం. విశాఖపట్నంలో లులూ మాల్‌కు ఆర్కే బీచ్‌ రోడ్డు సమీపాన 14 ఎకరాల స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థలంలో వినాయక ఉత్సవాలు భారీగా నిర్వహించడానికి యూత్‌ ఐకాన్‌ అసోసియేషన్‌కు ఏపీఐఐసీ అధికారులు అనుమతి ఇచ్చారు. దేశమంతా వినాయక ఉత్సవాలను నవరాత్రులు (తొమ్మిది రోజులు) చేస్తే వీరు 21 రోజులు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా సరే మట్టి లేదా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో విగ్రహం చేస్తారు. వీరు మాత్రం జర్మన్‌ సిల్వర్‌తో తయారు చేస్తున్నారు. ఇది నీటిలో కరగదు. నిమజ్జనం చేయడానికి వీలు కాదు. ఈ విషయం పక్కనపెడితే అక్కడ 14 ఎకరాలు అందుబాటులో ఉండగా అందులో ఆరు ఎకరాలు కేవలం వాహనాల పార్కింగ్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. అంటే ఏ సంఖ్యలో వాహనాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. పార్కింగ్‌ ఫీజు కూడా ఉంటుంది. మరో రెండు ఎకరాల్లో ఫ్లవర్‌ షో పెడతామంటున్నారు. మిగిలిన స్థలంలో రకరకాల ఎగ్జిబిషన్లు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తారు. స్టాళ్లు అద్దెకు ఇచ్చి డబ్బులు వసూలుచేస్తారు. ఇదంతా వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు. ఉత్సవానికి సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు వెచ్చిస్తున్నారు. అంతకు రెట్టింపు ఆదాయం కేవలం నెల రోజుల్లో పొందాలనేది లక్ష్యం. దీనికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు, ఫొటోలు వాడుకుంటున్నారు. ఏపీఐఐసీ అధికారులు కూడా ఆ ఎమ్మెల్యేల సిఫారసుతోనే ఆ భూమిని ఉత్సవాలకు ఇచ్చారు. 14 ఎకరాలు నెల రోజులు వాడుకోవడానికి ఇస్తున్నందున దానికి తగ్గట్టుగా ఫీజు వసూలు చేయాలి. ఆ అసోసియేషన్‌ నుంచి ఎంత ఫీజు వసూలు చేశారని ప్రశ్నిస్తే ఏపీఐఐసీ అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. ఇలా వ్యాపార ధోరణితో ఉత్సవాలను నిర్వహించే వారిని నాయకులే ప్రోత్సహించడాన్ని హిందూ పరిషత్‌ వంటి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Updated Date - Aug 14 , 2025 | 12:58 AM