బియ్యానికి బదులు డబ్బులు!
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:22 AM
నగరంలో కొంతమంది రేషన్ డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వడం లేదు. అందుకు బదులు డబ్బులు (కిలోకు రూ.12 నుంచి రూ.14) ఇస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే...‘ఇది మీ డిపో కాదు, మీ కార్డుతో మ్యాపింగ్ అయిన డిపో ఫలానా వీధిలో ఉంది. అక్కడకు వెళ్లి తీసుకోండి’ అంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో బట్టబయలు చేసింది.
ఇదీ నగరంలో పలువురు రేషన్ డీలర్ల తీరు
ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
కార్డుదారులు ప్రశ్నిస్తే బెదిరింపు ధోరణిలో సమాధానం
నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న పౌర సరఫరాల శాఖ
బియ్యం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
గాజువాక/మహారాణిపేట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కొంతమంది రేషన్ డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వడం లేదు. అందుకు బదులు డబ్బులు (కిలోకు రూ.12 నుంచి రూ.14) ఇస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే...‘ఇది మీ డిపో కాదు, మీ కార్డుతో మ్యాపింగ్ అయిన డిపో ఫలానా వీధిలో ఉంది. అక్కడకు వెళ్లి తీసుకోండి’ అంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో బట్టబయలు చేసింది.
రేషన్ డిపోల్లో సరకుల పంపిణీ ప్రారంభించి మూడు నెలలైంది. జూన్ నుంచి డిపోల వద్దే కార్డుదారులకు బియ్యం, పంచదార అందజేస్తున్నారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) రద్దు నేపథ్యంలో కార్డుదారుల పట్ల డీలర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నరో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సరకుల పంపిణీ, తూకం వంటి అంశాలపై ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సర్వే చేసింది. కార్డుదారుల పట్ల డీలర్లు మర్యాదగా ఉంటున్నారా?, సరకులు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా?, సరకులు నాణ్యంగా ఉంటున్నాయా?, ఏమైనా ప్రలోభాలకు గురిచేస్తున్నారా?...తదితర ప్రశ్నలు వేసి సమాధానం రాబడుతున్నారు. జూలై నెలకు సంబంధించి ఐవీఆర్‌ఎస్ సర్వే వివరాల ప్రకారం నగరంలో చాలాచోట్ల ముఖ్యంగా గాజువాక, కంచరపాలెం, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, వన్‌టౌన్, ఆరిలోవ, తదితరచోట్ల వేలిముద్ర వేయించుకుంటున్నారు కానీ బియ్యం ఇవ్వడం లేదని, అందుకు బదులు కిలోకు రూ.12 నుంచి రూ.14 వరకూ ఇస్తున్నారని కార్డుదారులు వివరించారు. తమకు డబ్బులు వద్దు, బియ్యం కావాలని అడిగితే...ఇది మీ డిపో కాదని, ఫలానా వీధిలో మీ కార్డుతో మ్యాపింగ్ అయిన డిపో ఉందని చెబుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.
విశాఖ జిల్లాలో 600కుపైగా డిపోల ద్వారా ఐదు లక్షల మంది కార్డుదారులకు ప్రతి నెలా ఎనిమిది వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఎండీయూల హయాంలో మాదిరిగానే కొందరు రేషన్ డీలర్లు కూడా బియ్యం పక్కదారి పట్టిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జిల్లాకు సమాచారం వచ్చింది. ఆయా డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ గత నెలాఖరున నోటీసులు జారీచేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల మేరకు డీలర్లు వివరణ ఇచ్చారని తెలిసింది. ఈ క్రమంలో ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ ప్రారంభం కావడంతో పౌర సరఫరాల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిపోలను తనిఖీ చేస్తున్నారు. అక్కడకు వచ్చిన కార్డుదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కార్డుదారుల పట్ల మర్యాదగా ఉండాలని, వేలిముద్ర వేసిన తరువాత బియ్యం మాత్రమే ఇవ్వాలని...సొమ్ములు అందజేసే ప్రక్రియ చేపడితే చర్యలు తీసుకుంటామని డీలర్లకు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో పంపిణీ పూర్తయిన తరువాత ప్రభుత్వం చేపట్టే ఐవీఆర్‌ఎస్ సర్వేలో కార్డుదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.