Share News

అమ్మ బయలెల్లినాదే..

ABN , Publish Date - May 11 , 2025 | 11:35 PM

పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ అభిషేక్‌గౌడ, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహం, తల్లిగరకలను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

అమ్మ బయలెల్లినాదే..
ఆలయంలో పూజలందుకుంటున్న మోదకొండమ్మ, ఘటాలతో ఊరేగింపుగా శతకంపుట్టుకు వెళుతున్న భక్తులు

మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

ఉత్సవ విగ్రహం, పాదాలతో భారీ ఎత్తున ఊరేగింపు

ఘటాలతో పెద్ద సంఖ్యలో అనుసరించిన భక్తులు

శతకంపట్టులో కొలువుతీరిన అమ్మవారు

రేపటి వరకు ఇక్కడే ప్రత్యేక పూజలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ అభిషేక్‌గౌడ, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహం, తల్లిగరకలను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత ఉత్సవ, ఆలయ కమిటీల ప్రతినిధులు, స్థానికులు అమ్మవారి ఘటాలను తలకెత్తుకున్నారు. ఆలయం నుంచి భారీ ఊరేగింపుతో శతకంపట్టు వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. కాగా ఊరేగింపులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. ఊరేగింపు ముందున అమ్మవారికి ప్రీతిపాత్రమైన డప్పుల వాయిద్యాలు, పలురకాల నృత్యాలు, కేరళ ఓనం బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు.

రేపటి వరకు శతకంపట్టులో పూజలు

ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. 13వ తేదీ సాయంత్రం వరకు ఇక్కడే పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ఆఖరి రోజైన మంగళవారం శతకంపట్టులో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను భారీగా ఊరేగింపుతో తిరిగి ఆలయానికి చేర్చుతారు. మంగళవారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాడేరుకు తరలివచ్చి ఇటు శతకంపట్టులో ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను, అటు ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుంటారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.కోటినాయుడు, ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి సుబ్బారావు, కె.సురేశ్‌కుమార్‌, కెజియారాణి, సల్లా రామకృష్ణ, టి.ప్రసాదరావునాయుడు, కె.ప్రశాంత్‌, కె.వెంకటరమణ, జీకేవీధి జడ్పీటీసీ సభ్యురాలు కె.శివనాగరత్నం, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ అమిత్‌బర్దార్‌,చ ఏఎస్పీ కె.ధీరజ్‌, డీఎస్పీ శహబాజ్‌ అహ్మద్‌ పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - May 11 , 2025 | 11:35 PM