రూ.350 కోట్లతో ‘రైవాడ’ ఆధునికీకరణ
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:15 AM
మండలంలోని రైవాడ జలాశయాన్ని జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. కుడి, ఎడమ కాలువల ఇన్‌టెక్ ఛాంబర్‌ల పనితీరును పరిశీలించారు. స్పిల్‌వే వద్దకు వెళ్లి గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో/ అవుట్‌ఫ్లో వివరాలను డీఈఈ జి.సత్యనాయుడును అడిగి తెలుసుకున్నారు.
‘డ్రిప్’ పథకం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు
రూ.50 కోట్ల ‘జైకా’ నిధులతో కాలువల అభివృద్ధి
చిన్నతరహా సాగునీటి వనరుల మరమ్మతులకు రూ.133 కోట్లతో ప్రతిపాదనలు
జలవనరుల శాఖ ఎస్‌ఐ అప్పలనాయుడు
దేవరాపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడ జలాశయాన్ని జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. కుడి, ఎడమ కాలువల ఇన్‌టెక్ ఛాంబర్‌ల పనితీరును పరిశీలించారు. స్పిల్‌వే వద్దకు వెళ్లి గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో/ అవుట్‌ఫ్లో వివరాలను డీఈఈ జి.సత్యనాయుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రైవాడ అతిథిగృహానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. డ్యామ్ రిహేబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) ద్వారా రూ.350 కోట్లతో రిజర్వాయర్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు ఆయన చెప్పారు. ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభమవుతుందన్నారు. పంట కాలువల ఆఽధునికీకరణకు ‘జైకా’ నిధులు రూ.50 కోట్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.
జిల్లాలో గ్రోయిన్లకు మరమ్మతులతోపాటు వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు, ఐదు ఎకరాలకుపైబడి విస్తీర్ణం కలిగిన చెరువుల అభివృద్ధి కోసం ‘ట్రిపుల్ ఆర్’ పథకం ద్వారా రూ.133 కోట్ల వ్యయంతో 88 పనులు చేపట్టడానికి ప్రభుత్వ అనుమతి కోరామన్నారు. జల వనరుల శాఖలో సిబ్బంది కొరత వుందని, సుమారు వంద మంది సిబ్బంది అవసరమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆయన వెంట డీఈఈ జి.సత్యనాయుడు, జలాశయం చైర్మన్ పోతల పాత్రునాయుడు, ఇతర అధికారులు వున్నారు.