పకడ్బందీగా మోదకొండమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - May 07 , 2025 | 12:27 AM
ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టాలని, భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలన్నారు. భక్తుల తాకిడి, ట్రాఫిక్, ఇతర క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు
- భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలి
- అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
- మద్యం దుకాణాలు నాలుగు రోజుల పాటు బంద్
పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టాలని, భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలన్నారు. భక్తుల తాకిడి, ట్రాఫిక్, ఇతర క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ క్రమంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సదుపాయం, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా వంటివి చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి భక్తులకు సహకరించాలని, ప్రొటోకాల్ ప్రకారం దర్శనాలు కల్పించడంతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పాడేరులోని మద్యం దుకాణాలను పూర్తిగా బంద్ చేయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమించకుండా పోలీస్, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులు ఘాట్ మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. గృహ విద్యుత్‌ను వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించకూడదన్నారు. ఉత్సవ, ఆలయ కమిటీ, అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ నాగవెంకట సాహిత్, డీఆర్‌వో కె.పద్మలత, టీడబ్ల్యూ ఎస్‌డీసీ లోకేశ్, డీఎస్‌సీ షెహబాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కె.ప్రశాంత్, కె.సురేశ్‌కుమార్, కెజియారాణి, ఎస్.రామకృష్ణ, టి.ప్రసాద్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.