యోగాకు జన సమీకరణ
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:38 AM
ఈనెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మందిని సమీకరించాలని కూటమి శాసనసభ్యులు, ఇన్‌చార్జులు నిర్ణయించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మంది...
21వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకల్లా జనం కంపార్టుమెంట్లకు చేరుకునేలా ఏర్పాట్లు
కూటమి నేతల నిర్ణయం
రేపటి టీడీపీ కార్యకర్తల సమావేశానికి ఐదారు వేల మంది
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మందిని సమీకరించాలని కూటమి శాసనసభ్యులు, ఇన్‌చార్జులు నిర్ణయించారు. శనివారం వీఎంఆర్‌డీఏలో చైర్మన్ ప్రణవ్‌గోపాల్ ఛాంబర్‌లో అంతా సమావేశమయ్యారు. పార్కు హోటల్ నుంచి భీమిలి వరకూ ఏర్పాటుచేస్తున్న కంపార్టుమెంట్లు ఏఏ నియోజకవర్గాలకు కేటాయించేదీ అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను కంపార్టుమెంట్లకు తరలించే బాధ్యత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు అప్పగించారు. 21వ తేదీ ఉదయం 5.30 గంటలకల్లా జనం కంపార్టుమెంట్లకు చేరుకునేలా క్షేత్రస్థాయిలో నాయకులు పర్యవేక్షించాలని సూచించారు. ఇదిలావుండగా యోగా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనకు 16వ తేదీన నగరానికి వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు మధ్యాహ్నం మూడు గంటలకు పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నాలుగైదు వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సీనియర్ నేతలు బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, విష్ణుకుమార్‌రాజు, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
బీచ్‌రోడ్డులో 268 కంపార్టుమెంట్లు
పర్యవేక్షణకు తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, వలంటీర్ల నియామకం
నగరానికి రెండున్నర లక్షల మ్యాట్లు, టీషర్టులు
ప్రధాన వేదిక ముందువరుసలో నేవీకి స్థానం
20న ఏయూలో 25 వేల మంది గిరిజన యువతతో సూర్యనమస్కారాలు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డులో 268 కంపార్టుమెంట్‌లు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతి కంపార్టుమెంట్‌ను ఒక సూపర్‌వైజర్, ఇద్దరు వలంటీర్లతో కూడిన బృందం పర్యవేక్షిస్తోందన్నారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక తహశీల్దారును నియమిస్తామన్నారు. ఇంకా కార్యక్రమ పర్యవేక్షణకు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రానున్నారని వివరించారు. యోగా దినోత్సవానికి సచివాలయ స్థాయి నుంచి జనాలను సమీకరిస్తున్నామన్నారు. ఉదయం 5.30 గంటలకల్లా కంపార్టుమెంట్లకు వచ్చేలా ఇప్పటినుంచీ చైతన్యపరుస్తున్నామని వివరించారు. కేంద్రం నుంచి సుమారు రెండున్నర లక్షల మ్యాట్లు, టీషర్టులు నగరానికి చేరుకున్నాయని, వాటిని ఏయూలో భద్రపరిచామని కలెక్టర్ తెలిపారు. మిగిలినవి త్వరలో రానున్నాయన్నారు. ఈనెల 20వ తేదీ ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25 వేల మంది గిరిజన యువతతో సూర్యనమస్కారాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఇది కూడా ఒక రికార్డుగా నమోదుకానున్నదన్నారు. వారంతా 21వ తేదీ ఉదయం ఏయూలో యోగా ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. యోగా దినోత్సవంలో ప్రధాన వేదిక ఆర్కే బీచ్‌రోడ్డులో ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే ప్రధాన వేదిక ముందు వరుసలో నేవీకి చెందిన అధికారులు, ఇతర సిబ్బంది ఉంటారని వివరించారు.