‘ది డెక్’లో మిట్టల్ ఆఫీస్?
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:27 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ‘ది డెక్’ ఐకానిక్ భవనంలో ఆఫీసు స్థలం కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి.
పార్కింగ్ కోసం కేటాయించిన ఫ్లోర్ కేటాయింపు?
బోర్డులో చర్చించిన తరువాత నిర్ణయం
ఐకానిక్ బిల్డింగ్‌లో స్థలానికి భారీ డిమాండ్
ఇటీవల వేలంలో రూ.82 పలికిన చదరపు అడుగు ధర
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ‘ది డెక్’ ఐకానిక్ భవనంలో ఆఫీసు స్థలం కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. వాస్తవానికి దీనిని పార్కింగ్ కోసం నిర్మించారు. మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం డిజైన్ చేశారు. అందులోనే ఆఫీస్ స్పేస్‌కు అవకాశం కల్పించారు. మొత్తం 12 అంతస్థుల్లో మూడు బేస్‌మెంట్లు, రెండో అంతస్థును పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన వాటిని ఆఫీస్‌ల కోసం డిజైన్ చేశారు. అందులో రెండు అంతస్థులను జార్జియా యూనివర్సిటీ, భెల్ ఐటీ కంపెనీ తీసుకున్నాయి. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయం కోసం రెండు అంతస్థులు తీసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండగా దాని కోసం మూడు సంస్థలు పోటీ పడ్డాయి. ఈ నెల 19న వేలం వేశారు. చదరపు అడుగుకు రూ.82 అద్దె ఇవ్వడానికి ఓ సంస్థ ముందుకువచ్చింది. సుమారు 29 వేల చ.అ. స్థలం తీసుకుంది. దీంతో పార్కింగ్ మినహా అన్ని అంతస్థులు నిండిపోయాయి. అయితే నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు పెడుతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ కంపెనీ తమ ఆఫీసు కోసం ‘ది డెక్’లో స్థలం కావాలని పట్టుబడుతోంది. తక్షణమే తమకు కేటాయించకపోతే స్టీల్ ప్లాంటు పనులు ఆలస్యమవుతాయని చెబుతోంది. రెండో అంతస్థులో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని తమకు ఇవ్వాలని కోరుతోంది. అవసరమైన మార్పులు చేసుకొని కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని చెబుతోంది. దీంతో వీఎంఆర్‌డీఏ అధికారులు అమరావతి అధికారులతో మాట్లాడి బోర్డులో దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
వాస్తవానికి సిరిపురం జంక్షన్‌లో పార్కింగ్‌కు పెద్ద డిమాండ్ లేదు. చిల్డ్రన్ ఎరీనాలో అవసరమైనంత పార్కింగ్ స్థలం ఉంది. వీఎంఆర్‌డీఏకు వచ్చే వారికి పార్కింగ్ స్థలం ఉంది. సమీపంలో ఎక్కువ మంది వాహనాల్లో వచ్చే భవనాలు ఏమీ లేవు. దాంతో బేస్‌మెంట్‌లో పార్కింగ్ కోసం కేటాయించిన మూడు అంతస్థులు సరిపోతాయని భావిస్తున్నారు. వాటిలో 300 కార్లు, మరో 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. అంతకు మించిన డిమాండ్ ఉండదనే భావనతో పార్కింగ్ కోసం ఉద్దేశించిన రెండో అంతస్థును ఆఫీస్‌గా మార్చాలని నిర్ణయించారు.