తప్పులతడకలుగా స్మార్ట్ రైస్‌కార్డులు
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:12 AM
స్మార్ట్ రైస్ కార్డుల్లో వివరాలు తప్పుల తడకలుగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
మారిపోయిన పేర్లు, చిరునామాలు
మరోవైపు చాలామందికి అందని కార్డులు
రేషన్ డిపోల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు
సహకరించని డీలర్లు
గాజువాక/మురళీనగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
స్మార్ట్ రైస్ కార్డుల్లో వివరాలు తప్పుల తడకలుగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ కార్డు ఏ డిపోలో ఉందో తెలియక కొందరు డిపోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
పౌర సరఫరాల శాఖ ఇటీవల ముద్రించి పంపిణీ చేసిన స్మార్ట్ రైస్ కార్డుల ముద్రణలో లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఇతర వివరాలు ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. దీంతో కార్డుదారుని పేరులో సంబంధం లేని అక్షరాలు ముద్రితమయ్యాయి. చిరునామాల్లో కూడా తప్పులు దొర్లాయి. అంతేకాకుండా కార్డుదారుని ఫొటోకు బదులుగా మరొకరి ఫొటో ముద్రించారు. ఉర్దూ అక్షరాలు, అచ్చ తెలుగు సంఖ్యలు ముద్రించారు. కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలను తప్పుగా నమోదు చేశారు. భర్తను తండ్రిగా, కొడుకుని తమ్ముడిగా పేర్కొన్నారు. పేర్లలోనూ తప్పులు చోటుచేసుకున్నాయి. ఇంటి పేర్లు కార్డుదారులే పోల్చుకోలేనంతగా దారుణంగా ఉన్నాయి. ఇలా ప్రతి డిపోలో ఐదు నుంచి పది శాతం కార్డుల్లో తప్పులున్నాయి. దీనిపై ఆందోళన వద్దని ఆందోళన వద్దని, నుంచి సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తులు ఇచ్చి సరిచేసుకోవాలని పౌర సరఫరాల అధికారులు పేర్కొంటున్నారు.
కార్డు కోసం తిప్పలు
స్మార్ట్ కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిపోలకు వెళ్లి వాకబు చేసినా అక్కడ లేవని సమాధానం వస్తోంది. కార్డుదారుల వివరాలకు అతని ఫోన్ నంబర్ లింకేజీ ఆప్షన్ లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా వీధుల్లో కార్డుదారులకు సరుకులిచ్చారు. ఈ క్రమంలో డిపోలకు, కార్డుదారులకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో లబ్ధిదారుల చిరునామాల మార్పుపై అప్‌డేట్ లేదు. జగన్ ప్రభుత్వంలో వలంటరీ వ్యవస్థలో పనిచేసిన తాత్కాలిక సిబ్బంది ఇష్టారీతిన కార్డుదారుల చిరునామాలను మ్యాపింగ్ చేశారు. ఎక్కడో నివాసం ఉంటున్న వారిని స్థానిక సచివాలయానికి మ్యాపింగ్ చేసి వదిలేయడంతో తాజాగా జారీ అయిన స్మార్ట్ రేషన్ కార్డులు పాత చిరునామాలకే చేరాయి. అంటే నిత్యం రేషన్ తీసుకుంటున్న డిపో ఒకటైతే, కార్డు సచివాలయ మ్యాపింగ్ ఆధారంగా వేరే డిపోకు కార్డులు వెళ్లిపోయాయి. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి విషయంలోనూ ఇదే జరిగింది. కార్డులు వచ్చిన రోజు నుంచి రేషన్ లబ్ధిదారులు సచివాలయాలు, రేషన్ డిపోల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆన్‌లైన్‌లో కార్డు ఏ డిపోలో ఉందో తెలుసుకునే అవకాశం ఉన్నా కొందరు డీలర్లు ఆ పనిచేయడం లేదనే వాదన ఉంది. ఇదిలావుండగా కొంతమంది రేషన్ డీలర్లు...కార్డుల కోసం డిపోలకు వెళ్లినవారి వేలిముద్ర తీసుకుని బియ్యం బదులు డబ్బు ఇస్తున్నారు. కొత్త కార్డు ఎక్కడుదంటే..మా దగ్గర లేదు...ఎక్కడుందో తెలుసుకోవాలంటే తరువాత రండి అని పంపిస్తున్నారు. ప్రధానంగా వన్‌టౌన్ ఏరియాలో స్మార్ట్ కార్డుల కోసం డీలర్లు పూర్తిగా సహకరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.