Share News

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:15 PM

ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన మహిళ, ఆమె కుమారుడిని బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి డీఎస్పీ షేక్‌ షెహబాజ్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
హత్యకు గురైన కందుల లక్ష్మణ్‌రావు(ఫైల్‌ ఫొటో)

కొడుకుతో కలిసి హతమార్చిన మహిళ

చంపావతి గెడ్డ పక్కన పాతిపెట్టిన వైనం

వివాహేతర సంబంధమే కారణం

పోలీసుల విచారణతో వెలుగులోకి..

నిందితుల అరెస్టు

అనంతగిరి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన మహిళ, ఆమె కుమారుడిని బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి డీఎస్పీ షేక్‌ షెహబాజ్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

మండలంలోని భీంపోలు పంచాయతీ తరమానవలస గ్రామానికి కందుల లక్ష్మణరావు(36) అవివాహితుడు. అతనికి గుమ్మకోట పంచాయతీ కంచాలగుమ్మి గ్రామానికి చెందిన గెమ్మెల లక్ష్మితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కాగా ఈ నెల 11వ తేదీ రాత్రి లక్ష్మి ఇంటికి లక్ష్మణరావు వెళ్లాడు. ఆమెను బలవంతం చేయబోయాడు. పిల్లలు ఎదిగిరావడం, భర్తకు ఎక్కడ ఈ విషయం తెలిసిపోతుందోననే భయంతో ఆమె పక్కనున్న కర్రతో కొట్టి, రాయితో అతని తలపై మోదింది. అంతటిలో ఆగకుండా తన పెద్ద కుమారుడు గెమ్మెల లక్ష్మణరావు సాయంతో తాడుతో అతని మెడను బిగించింది. ఊపిరాడక లక్ష్మణరావు మృతి చెందాడు. అదే రోజు రాత్రి అక్కడ నుంచి మృతదేహాన్ని కర్రకు కట్టి సుమారు రెండు కిలోమీటర్లు మోసుకుంటూ గుమ్మకోట సమీపంలో గల చంపావతి గెడ్డ పక్కన వారిద్దరూ పాతిపెట్టారు.

అదృశ్యం కేసు దర్యాప్తులో నిజం వెలుగులోకి..

కందుల లక్ష్మణ్‌రావు ఈ నెల 11వ తేదీ నుంచి కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన అనంతగిరి ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు.. అరకు సీఐ హిమగిరి ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కందుల లక్ష్మణ్‌రావుకు గెమ్మెల లక్ష్మితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. బుధవారం కంచాలగుమ్మి గ్రామానికి డీఎస్పీ షెహబాజ్‌తో కలిసి అరకు సీఐ హిమగిరి, అనంతగిరి ఎస్‌ఐ శ్రీనివాసరావు వెళ్లి విచారించగా, హత్య చేసినట్టు గెమ్మెల లక్ష్మి, ఆమె కుమారుడు గెమ్మెల లక్ష్మణ్‌రావు అంగీకరించారు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని వారు చూపించారు. మృతదేహాన్ని తహసీల్దార్‌ వి.మాణిక్యం, వీఆర్వో కోటిబాబు సమక్షంలో బయటకు తీయించారు. మృతదేహాన్ని పాతిపెట్టి ఆరు రోజులు కావడంతో కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లింది. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు, సర్పంచ్‌ అప్పారావు, గ్రామ పెద్దల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 11:15 PM