Share News

తప్పిన మొంథా ముప్పు

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:59 AM

మొంథా తుఫాన్‌ తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అధికారులు సహాయక కార్యక్రమాలు వేగవంతం చేశారు. నగరంలో రహదారులకు అడ్డంగా పడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. పడిపోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి వేసి సరఫరా పునరుద్ధరించారు.

తప్పిన మొంథా ముప్పు

తగ్గుముఖం పట్టిన వర్షాలు

ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు

పడిపోయిన చెట్లు తొలగింపు విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణ

బాధిత కుటుంబాలకు నిత్యావసరాల సరఫరా

అధికారుల ముందస్తు ఏర్పాట్లతో మెరుగైన ఫలితాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మొంథా తుఫాన్‌ తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అధికారులు సహాయక కార్యక్రమాలు వేగవంతం చేశారు. నగరంలో రహదారులకు అడ్డంగా పడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. పడిపోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి వేసి సరఫరా పునరుద్ధరించారు. కూలిపోయిన గోడల వద్దకు ఎవరూ వెళ్లకుండా అడ్డంకులు ఏర్పాటుచేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రభావిత కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా వర్షాల వల్ల సముద్రంలో వేటకు వెళ్లకుండా ఆగిపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని తెలిపింది. నష్టం ఎంత అంటే...? తుఫాన్‌ కారణంగా ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందనేది అధికారులు ఇంకా అంచనా వేయలేదు. జిల్లాలోని 11 మండలాల్లో ఈ నాలుగు రోజుల్లో సగటున 3.7 సెం.మీ. వర్షపాతం కురిసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో మేహాద్రి, గంభీరం, తాటిపూడి రిజర్వాయర్లు ఉండగా అన్నింటిలోను నీరు బాగా చేరింది. మండలాల్లో తుఫాన్‌ బాధితుల కోసం 83 శిబిరాలు ఏర్పాటు చేయగా 21,584 మందిని తరలించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే తుఫాన్‌ తీరం దాటిన తరువాత వర్షాలు పెద్దగా లేకపోవడంతో 16 శిబిరాలను మాత్రమే ఉపయోగించారు. వాటిలోకి 1,516 మందిని తరలించారు. జిల్లాలో 22 ఇళ్లకు నష్టం వాటిల్లింది. అలాగే 21 గ్రామాల్లో 10.7.7 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీనివల్ల 383 మంది రైతులు నష్టపోయారు. సుమారు 160 చెట్లు కూలిపోగా, వాటన్నింటినీ పక్కకు తొలగించారు. పది విద్యుత్‌ స్తంభాలు పడిపోగా వాటిని కూడా పునరుద్ధరించారు. జిల్లాలో 27 ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోగా, మళ్లించే చర్యలు తీసుకున్నారు. తక్షణమే విద్యుత్‌ పునరుద్ధరణ పనులు ఈపీడీసీఎల్‌కు ఈ తుఫాన్‌ వల్ల స్వల్ప నష్టమే జరిగింది. రెండు గ్రామాలకు విద్యుత్‌ నిలిచిపోగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 33 కేవీ సబ్‌ స్టేషన్లు 12 పాడైపోగా వాటికి సంబంధించిన రెండు స్తంభాలు దెబ్బతిన్నాయి. 11కేవీ సబ్‌ స్టేషన్లు 26 ప్రభావితంగా కాగా రెండు స్తంభాలు పడిపోయాయి. వాటిని సరిచేశారు. ముందస్తు ఏర్పాట్లతో తగ్గిన నష్టం తుఫాన్‌ మొంథా తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదికలు, హెచ్చరికలు రావడంతో ప్రభుత్వం వాటిని ఎదుర్కొనడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అదికారులను అప్రమత్తం చేసింది. దాంతో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసి, మండలాలకు ప్రత్యేక అధికారుల నియమించి, వరద నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించారు. గురువారం కూడా సెలవు ఇచ్చారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఎమ్మెల్యేలు, మేయర్‌ అంతా అందుబాటులో ఉండి వారి వారి ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టారు. దాంతో పెద్దగా నష్టాలు ఏమీ జరగలేదు. ముందస్తు అప్రమత్తతతో అధిక నష్టం లేకుండా ఈ విపత్తును అధిగమించారు.

Updated Date - Oct 30 , 2025 | 12:59 AM