Share News

నిర్వహణలోపం ఉక్కుకు శాపం

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:07 AM

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం వివిధ విభాగాల నిర్వహణ పనులను గాలికి వదిలేసింది.

నిర్వహణలోపం ఉక్కుకు శాపం

యాజమాన్యం నిర్లక్ష్యం

విభాగాల్లో మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన

మేల్కొనకపోతే ప్రాణాలకే ముప్పు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం వివిధ విభాగాల నిర్వహణ పనులను గాలికి వదిలేసింది. కొన్ని విభాగాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రాణాంతకమైన వాయువులు లీక్‌ అవుతున్నాయని అక్కడ ఏర్పాటుచేసిన రెడ్‌ సిగ్నళ్లు వెలుగుతున్నా స్పందించడం లేదు. అత్యంత కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ట్యాంకులు, కూలింగ్‌ టవర్‌లు శిథిలావస్థకు చేరుతున్నా మరమ్మతులు చేపట్టడం లేదు. రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో కన్వేయర్లు పనిచేయడం లేదని రెండు నెలలుగా ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కన్వేయర్లపై షెడ్‌ల రేకులు ఊడిపోయాయి. వర్షం పడినప్పుడల్లా ఆ ఖాళీల్లో నుంచి నీరు కన్వేయర్లపై పడి ముడి పదార్థాలు తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో బెల్ట్‌లు ఆగిపోతున్నాయి. వీటి నిర్వహణకు కూడా యాజమాన్యం నిధులు కేటాయించడం లేదు.

స్టీల్‌ప్లాంటులో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు కచ్చితంగా చేపట్టాలి. అయితే కాంట్రాక్టు వర్కర్లను వేల సంఖ్యలో తగ్గించడం వల్ల ఆ పనులన్నీ నిలిచిపోయాయి. దాంతో ఎక్కడికక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్‌డీ గ్యాస్‌ లీకేజీ

స్టీల్‌ తయారీలో భాగంగా లింజ్‌-డోనవిట్జ్‌ (ఎల్‌డీ) గ్యాస్‌ విడుదల అవుతుంది. దానిని రికవరీ ప్లాంట్ల ద్వారా కలెక్ట్‌ చేసి రోలింగ్‌ మిల్స్‌ నడపడానికి ఉపయోగిస్తారు. ఈ గ్యాస్‌ చాలా ప్రమాదకరమైనది. గాలి కంటే బరువైనది. రంగు, వాసన ఉండవు. త్వరగా మండుతుంది. అత్యంత విషపూరితమైనది. ఇందులో ఎక్కువగా కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉంటుంది. దాంతో పాటు కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఉంటాయి. ఈ గ్యాస్‌ లీకయ్యే ప్రాంతంలో 15 నిమిషాలు ఉంటే కళ్లు తిరిగి పడిపోతారు. వాంతులు అవుతాయి. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే ప్రాణాపాయం కలుగుతుంది. ఈ గ్యాస్‌కు 12 సీల్‌ పాయింట్లు ఉన్నాయి. వాటి హోల్డర్‌ బేస్‌మెంట్లు పాడైపోయి గ్యాస్‌ లీకవుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఏర్పాటుచేసిన ఇండికేటర్లు (రెడ్‌ లైట్‌ ద్వారా) సూచిస్తున్నాయి. ఈ విభాగం సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. అక్కడ వ్యర్థాలు తినడానికి వచ్చిన కాకి ఒకటి ఎల్‌డీ గ్యాస్‌ పీల్చి చనిపోయింది. ఆ కళేబరం ఇంకా అక్కడే ఉంది.

ప్రమాదకరంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3

బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రమాదకరంగా మారింది. ఇక్కడ హాట్‌ మెటల్‌తో పాటు స్లాగ్‌ (బూడిద) వస్తుంది. దానిని గ్రాన్యులేషన్‌ ట్యాంకుల్లోకి తీసుకొని నీటిని పంపించి స్లర్రీ స్లాగ్‌గా మారుస్తారు. అయితే గ్రాన్యులేషన్‌ ట్యాంకులు రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరాయి. లోపల అంతా తుప్పు పట్టేశాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. వాటిని తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోవడం లేదు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూలింగ్‌ టవర్లకు సంబంధించిన సిమెంట్‌ స్ట్రక్చర్లు కూడా బీటలు వారిపోయాయి. వాటికీ మరమ్మతులు చేయడం లేదు.

ఇవి సంస్కరణలా..?

ప్లాంటును 100 శాతం సామర్థ్యంతో నడపాలంటే అన్నింటికీ నిర్వహణ పనులు చేపట్టాలి. అప్పుడే లక్ష్యం సాధించగలుగుతారు. అయితే యాజమాన్యం ఆ పనులను పక్కనపెట్టి ఉద్యోగుల పని గంటలు పెంచేసింది. తాజాగా స్టీల్‌ప్లాంటులో 30 కి.మీ. కంటే వేగంగా వాహనాలు నడిపేవారిని స్పీడ్‌ గన్‌ల ద్వారా గుర్తించి నోటీసులు ఇస్తోంది. అదేవిధంగా టౌన్‌షిప్‌లో హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహన చోదకులకు యాజమాన్యమే నోటీసులు ఇస్తోంది. క్యాంటీన్లు ఇప్పటికే తొలగించింది. జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. ప్లాంటును లాభాలలోకి తీసుకురావడానికి చేపడుతున్న సంస్కరణలు ఇవేనా?...అని అంతా ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

Updated Date - Sep 12 , 2025 | 01:07 AM