Share News

దారితప్పిన దర్యాప్తు

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:19 AM

కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు వ్యక్తులను నగరానికి రప్పించి, వారి కోసం హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసిన వైద్యుడితోపాటు వారి వెనుక ఉన్నవారెవరనేది బయటకు లాగాల్సిన ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దారితప్పిన దర్యాప్తు

ఫోర్త్‌టౌన్‌ పోలీసుల వింతవైఖరి

కిడ్నీ రాకెట్‌ తీగ లాగకుండా హోటల్‌కు బిల్లు కట్టలేదనే ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదు

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు వ్యక్తులను నగరానికి రప్పించి, వారి కోసం హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసిన వైద్యుడితోపాటు వారి వెనుక ఉన్నవారెవరనేది బయటకు లాగాల్సిన ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాకు చెందిన రంగబాబు, ఏసురాజు అనేవారు గత నెల 30న నగరానికి వచ్చి అక్కయ్యపాలెంలోని ఒక హోటల్‌లో దిగారు. వారిద్దరూ కిడ్నీ విక్రయం గురించి చర్చించుకుంటుండగా హోటల్‌ సిబ్బంది విని, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా, డాక్టర్‌ ఆనంద్‌ అనే వ్యక్తి తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారని, కిడ్నీ విక్రయం గురించి మాట్లాడుకున్నామని రంగబాబు చెప్పాడు. కిడ్నీ విక్రయం నేరం కాబట్టి, పోలీసులు రంగబాబు వాంగ్మూలంపై నిజనిజాలు నిర్ధారించుకుని వైద్యుడిపై కేసు నమోదుచేయాలి. వైద్యుడితోపాటు ఏజెంట్లు, మరెవరికైనా ఈ వ్యవహారంలో సంబంధం ఉందా? అనేదానిపై దర్యాప్తుచేయాలి. కానీ పోలీసులు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ విక్రయంపై ఇద్దరు వ్యక్తులు చర్చించుకుంటున్నట్టు తెలియగానే వారిని స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు ఆ విషయాన్ని...ఈనెల 13 వరకు ఉన్నతాధికారులకు గానీ, మీడియాకు గానీ వెల్లడించలేదు. దీనిపై స్పెషల్‌బ్రాంచికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ ఒకరు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు చేరవేయడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవ్వడంతో సీపీ శంఖబ్రతబాగ్చీ స్పందించారు. అసలు హోటల్‌లో ఏం జరిగిందనే దానిపై తక్షణం తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏసీపీ కె.లక్ష్మణమూర్తి హోటల్‌కు వెళ్లి విచారణ జరిపారు. గత నెల 30న ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గది బుక్‌ చేసిన వైద్యుడు డాక్టర్‌ ఆనంద్‌, ఈ ఏడాది జనవరిలో ఒడిశాకు చెందిన ముగ్గురికి అదే హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసినట్టు తేలింది. పైగా ఆ ముగ్గురు మూడు రోజులు హోటల్‌లోనే ఉండి తర్వాత బిల్లు చెల్లించకుండా వెళ్లిపోవడంతో రూమ్‌ బుక్‌ చేసిన డాక్టర్‌ ఆనంద్‌ను సిబ్బంది సంప్రతించగా, స్పందించలేదని తేలింది. ఈ నేపథ్యంలో రూమ్‌ తీసుకున్న వైద్యుడు బిల్లు చెల్లించలేదని సిబ్బంది వద్ద ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు ఫిర్యాదు తీసుకుని బుధవారం కేసు నమోదుచేశారు. అంతేతప్ప డాక్టర్‌ ఆనంద్‌ గతంలో ముగ్గురు వ్యక్తులను ఒడిశా నుంచి ఎందుకు రప్పించారు?, ఇప్పుడు మరో ఇద్దరిని ఎందుకు రప్పించారు?...అనే విషయాలను విస్మరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 18 , 2025 | 01:19 AM