Share News

మంత్రి నారా లోకేశ్‌ ప్రజా దర్బార్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:17 AM

ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

మంత్రి నారా లోకేశ్‌ ప్రజా దర్బార్‌

సమస్యల పరిష్కారానికి హామీ

మహారాణిపేట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రజాదర్బార్‌ నిర్వహించడం ఇది 78వసారి. కంచరపాలెం ఐటీఐలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తనకు ఇంతవరకూ రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందలేదని ఎల్‌.సతీశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. అవి త్వరగా అందేలా చూడాలని కోరారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెం భూ నిర్వాసితులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. 2008లో పరిశ్రమల పేరిట ఏపీఐఐసీ భూ సేకరణ చేపట్టిందని, ఏళ్లు గడుస్తున్నా పునరావాసం కల్పించలేదని వాపోయారు. విశాఖ ఏపీహెచ్‌బీలో తన ప్లాట్‌ను ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని ఎస్‌.లావణ్య అనే ఆమె మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా వినతులు పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.


విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా పట్టాభి?

విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చోడె వెంకట పట్టాభి నియమితులు కానున్నట్టు తెలిసింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన పట్టాభి పార్టీలో సీనియర్‌ నేత. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2007లో జీవీఎంసీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీటీడీ లోకల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండు నెలల క్రితం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడి పదవి కోసం అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆయనతోపాటు మహ్మద్‌ నజీర్‌, లొడగల కృష్ణ తదితరులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో పట్టాభి పేరును కొంతమంది నేతలు గట్టిగా సిఫారసు చేశారు. పట్టాభి పేరును నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షునితోపాటు జిల్లా కమిటీ మొత్తం మారనుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా గండి బాబ్జీ ఉన్నారు.


ఒడిశా గవర్నర్‌ హరిబాబు రాక

విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు మంగళవారం విశాఖపట్నం వచ్చారు. దసపల్లా హిల్స్‌లోని తన స్వగృహంలో బస చేశారు. బుధవారం సాయంత్రం ఐఐఏఎంలో జరిగే కాన్వొకేషన్‌లో పాల్గొంటారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీకి వెళతారు. అక్కడి నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వెళతారు. శుక్రవారం అక్కడి కార్యక్రమాలు చూసుకొని రాత్రికి తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు.

Updated Date - Dec 17 , 2025 | 01:17 AM