Share News

మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:30 AM

ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌

ప్రజల నుంచి వినతుల స్వీకరణ

సమస్యల పరిష్కారానికి హామీ

మహారాణిపేట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వారు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. స్టీల్‌ప్లాంటు టౌన్‌షిప్‌లో 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జీతం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బోధన, బోధనేతర ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్‌ స్టాఫ్‌కు స్టీల్‌ప్లాంటులో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ స్కీమ్‌ వర్తింపజేసి, పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌ను సిబ్బంది విజ్ఞప్తి చేశారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు (కన్నబాబు) ప్రోద్బలంతో తనపై నమోదు చేసిన రౌడీషీట్‌ను రద్దు చేయాలని, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్‌ కోరారు. ఆయా వినతులను పరిశీలించిన మంత్రి లోకేశ్‌ పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.


స్టీల్‌ప్లాంటులో ప్రమాదం

ద్రవపు ఉక్కు డంప్‌ చేస్తుండగా చెలరేగిన మంటలు

ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడిన ఉద్యోగులు

ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో ఉద్యోగులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. కార్మికులు అందించిన వివరాల ప్రకారం...బ్లాస్ట్‌ఫర్నేస్‌ 1, 2 విభాగాల మధ్యలో గల పిట్‌ (ద్రవపు ఉక్కు వేసే ప్రదేశం)లో శుక్రవారం ఉదయం లాడిల్‌ గుండా బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం నుంచి తీసుకువెళ్లిన ద్రవపు ఉక్కును డంప్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పిట్‌ వద్ద భారీ శబ్దం రావడంతో పాటు మంటలు రేగాయి. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగం సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్లాంటులో భారీ పేలుడు సంభవించిందని కార్మికులు భయపడ్డారు. కానీ చిన్న ప్రమాదమే కావడం, ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 01:30 AM