Share News

నగరానికి మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:32 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు.

నగరానికి మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే బుద్ధ నాగజగదీశ్వరరావు, తదితరులు స్వాగతం పలికారు. మంత్రి ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి బస చేశారు. మంగళవారం రుషికొండలోని రాడిసిన్‌ బ్లూ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో జీఎంఆర్‌, మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పాల్గొంటారు. అనంతరం మంత్రి లోకేశ్‌ 1.45 గంటలకు బయలుదేరి రెండు గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు.


నేడు గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు రాక

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు మంగళవారం నగరానికి వస్తున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు రుషికొండ రాడిసన్‌ హోటల్‌కు చేరుకుని జీఎంఆర్‌, మాన్సాస్‌ ఏవియేషన్‌ విద్యా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌ నుంచి బయలుదేరి విజయనగరం వెళతారు.


మహిళల టీ20 టికెట్ల విక్రయం

విశాఖపట్నం-స్పోర్ట్స్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 21, 23తేదీల్లో భారత్‌, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు సోమవారం రాత్రి 7.00 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. రెండు మ్యాచ్‌లకు సంబంధించి ‘డిస్ర్టిక్‌ బై జొమాటో’లో టికెట్లు లభించనున్నాయని ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. టికెట్‌ ధరలు రూ.200, రూ.300, రూ.400గా నిర్ణయించామని పేర్కొన్నారు. ఇటీవల వరల్డ్‌ కప్‌ను భారత్‌ మహిళల జట్టు చేజిక్కుంచుకున్న నేపథ్యంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది.


రైళ్లు మళ్లింపు

జాబితాలో ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-షాలిమార్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌...

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ, రాజమండ్రి సెక్షన్‌లలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లు మళ్లింపు మార్గంలో నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 16 (మంగళవారం)న బెంగళూరు-నారంజి ప్రత్యేక రైలు (06559), ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ (22643); ఈ నెల 17న చెన్నై-షాలిమార్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (02842); 22న ముజాఫర్‌పూర్‌-బెంగళూరు (15228), గువహటి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12510); 23న బెంగళూరు-హటియా ఎక్స్‌ప్రెస్‌ (12836) రైళ్లు విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడుస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 01:32 AM