ప్రైవేటుకు గనుల సీనరేజీ వసూలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:37 AM
ఉమ్మడి జిల్లాలో గనుల సీనరేజీ వసూలు బాధ్యతను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు.
రెండేళ్లకు రూ.432.43 కోట్లు చెల్లించేందుకు ముందుకువచ్చిన ఏఎంఆర్ కంపెనీ
కేసులు రాయడానికి పరిమితం కానున్న గనుల శాఖ
విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో గనుల సీనరేజీ వసూలు బాధ్యతను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. రెండేళ్లకు రూ.432.43 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చిన ఏఎంఆర్ కంపెనీకి టెండర్ దక్కింది. సగటున నెలకు రూ.36 కోట్లు వంతున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గనుల శాఖ అక్రమ క్వారీయింగ్ చేసే వ్యక్తులపై దాడులు చేసి కేసులు రాయడానికి మాత్రమే పరిమితం కానున్నది.
ఉమ్మడి జిల్లాలో గనుల శాఖకు విశాఖపట్నంలో డీడీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరుల్లో ఏడీ కార్యాలయాలు ఉన్నాయి. ఏటా జిల్లా నుంచి గనుల శాఖకు సుమారు రూ.200 కోట్ల ఆదాయం (గ్రానైట్, లేటరైట్, బ్లాక్ మెటల్, గ్రావెల్ క్వారీల ద్వారా) సమకూరుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా సీనరేజీ వసూలు బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను రెండు కంపెనీలకు టెండర్లు ద్వారా అప్పగించారు. విశాఖ జిల్లాకు సంబంధించి అప్పట్లో వైసీపీ నాయకులు అంగీకరించకపోవడంతో టెండర్లు పిలవలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖ జిల్లాకు టెండర్లు ఆహ్వానించగా ఈ నెలలో ఖరారు చేశారు. రెండేళ్లలో రూ.432.43 కోట్లు అంటే ఏడాదికి రూ.216.21 కోట్లు వంతున ప్రభుత్వానికి చెల్లించేలా టెండరు ఖరారుచేశారు.
గనుల శాఖలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. లీజులు మంజూరు, అప్పుడప్పుడు తనిఖీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. అంతేతప్ప అక్రమ క్వారీయింగ్‌ను, పర్మిట్లు లేకుండా సాగుతున్న రవాణాను అరికట్టలేకపోతున్నారు. నర్సీపట్నం పరిధి నాతవరం మండలంలో లేటరైట్ తవ్వకాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ తవ్విన దానికి ప్రభుత్వానికి చెల్లించే సీనరేజీకి మధ్య భారీ తేడా ఉంది. రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే అనకాపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా పలువురు మెటల్ తవ్వుకుంటున్నారు. ఇంకా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వాటికి ఎటువంటి పర్మిట్లు లేవు. ఈ నేపథ్యంలో గ్రావెల్ నుంచి లేటరైట్ వరకూ ప్రతి దానికీ సీనరేజీ వసూలు చేసే బాధ్యతను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ సొంతంగా మనుషులను నియమించుకుంటుంది. పర్మిట్లు లేకపోతే వాహనాలను గనుల శాఖకు అప్పగిస్తుంది. ఆ తరువాత జరిమానా వసూలుచేసే బాధ్యత ప్రైవేటు కంపెనీ తీసుకుంది. రెండు, మూడు రోజుల్లో ప్రైవేటు కంపెనీకి ఈ బాధ్యత అప్పగించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.