ఏజెన్సీలో కనీస విద్యా ప్రమాణాల్లేవ్
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:12 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాయడం, చదవడం రావడం లేదని అనంతగిరి, అరకు జడ్పీటీసీ సభ్యులు డి. గంగరాజు, శెట్టి రోష్ని ఆందోళన వ్యక్తంచేశారు.
హైస్కూల్ విద్యార్థులు చదవలేకపోతున్నారు
జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ఆందోళన
ఏకీభవించిన జడ్పీ చైర్‌పర్సన్
విశాఖపట్నం/మహారాణిపేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాయడం, చదవడం రావడం లేదని అనంతగిరి, అరకు జడ్పీటీసీ సభ్యులు డి. గంగరాజు, శెట్టి రోష్ని ఆందోళన వ్యక్తంచేశారు. ఏకలవ్య పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ప్రవేశం కోసం తీసుకెళ్లిన విద్యార్థికి పరీక్ష పెడితే కనీసం పరిజ్ఞానం లేదని ప్రిన్సిపాల్ చెప్పడంతో సిగ్గుపడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. విద్యాశాఖపై చర్చ ప్రారంభంతోనే అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో ఏళ్ల తరబడి విద్యా బోధనపై నిర్లక్ష్యం చూపుతున్నందున గిరిజన విద్యార్థులకు కనీస స్థాయి లేదన్నారు. అరకు జడ్పీటీసీ సభ్యురాలు రోష్ని మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో కాకుండా ఇంటర్మీడియట్‌లో చదవలేని పిల్లలున్నారని వ్యాఖ్యానించారు. సభ్యుల ఆవేదనతో జడ్పీ చైర్‌పర్సన్ ఏకీభవించారు. ఏజెన్సీలో కొన్ని పాఠశాలల్లో టీచర్లు బాగా పనిచేస్తూ.. విద్యార్థులకు మంచి బోధన అందిస్తుండగా.. మరికొన్నిచోట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. చర్చకు విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ సమాధానమిస్తూ విద్యార్థులలో ప్రమాణాలు పెంచడానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరో తరగతిలో చేరిన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నవారిని గుర్తించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సిలబస్ బోధించేందుకు సంసిద్థత అనే కార్యక్రమం చేపట్టామన్నారు. వీరికి వచ్చే నెల నాలుగో తేదీన రడీనెస్ పేరిట పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీలోని జూనియర్ కళాశాలల్లో అతిఽథి అధ్యాపకుల నియామక వివరాలు వెల్లడించకపోవడం, ఫోన్‌కు సమాధానం చెప్పకపోవడంపై అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి భీమశంకరరావుపై చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అధికారిపై ఇంటర్ విద్యా కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. దేవరాపల్లి జడ్పీ స్కూలులో హిందీ, వ్యాయామ ఉపాధ్యాయుల్ని నియమించాలని దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రిసత్యం కోరారు.
కొత్త పింఛన్లు మంజూరు చేయండి
సంక్షేమ పథకాలపై చర్చలో భాగంగా దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు కర్రి సత్యం, గిరిబాబులు మాట్లాడుతూ కొత్తగా సంక్షేమ పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అర్హులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కార్మికులకు మే నెల నుంచి వేతనాలు అందడం లేదని ఫిర్యాదు చేయగా.. దానిపై వివరణ ఇచ్చేందుకు అల్లూరి జిల్లా డ్వామా అధికారులు రాకపోవడంపై చైర్‌పర్సన్ సుభద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దశలో కొందరు సభ్యులు మాట్లాడుతూ జడ్పీ సమావేశానికి పలు శాఖల అధికారులు రావడం లేదని పేర్కొంటూ వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని కోరగా.. అందుకు చైర్‌పర్సన్ సమ్మతించారు. వైద్య ఆరోగ్యశాఖపై చర్చ సందర్భంగా 108 వాహనాలు సరిగ్గా పనిచేయడం లేనందున అత్యవసర రోగులకు సేవల అందడం లేదని కె. కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ అన్నారు. దీనిపై 108 కో-ఆర్డినేటర్ సురేష్ బదులిస్తూ.. అత్యవసర రోగులు కాకుండా చిన్నపాటి సుస్తీ చేసినా వాహనం కోసం ఫోన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో అత్యవసర రోగులు ఇబ్బంది పడుతున్నారని వివరణ ఇచ్చారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో వైద్యులు కొందరి పనితీరు బాగాలేదని అనకాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు సత్యవతి వ్యాఖ్యానించారు. మాకవరపాలెం జడ్పీటీ సభ్యురాలు మాట్లాడుతూ తాళ్లపాలెం నుంచి మాకవరపాలెం వరకు రోడ్ విస్తరణలో తొలగించిన చెట్లను కొందరు అటవీ శాఖ అనుమతి లేకుండా విక్రయించారని ఆరోపించారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, పలు శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
బల్లగరువు-మడ్రేబు రోడ్డు పనులు ఎప్పుడు..
అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత డిసెంబరులో బల్లగరువు నుంచి తున్సీబా మీదుగా దాయర్తి, మడ్రేబుల వరకు 12 కి.మీ. రోడ్‌కు రూ.11.6 కోట్లు మంజూరు చేస్తే ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ప్రస్తావించగా.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఈ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ మూడోసారి టెండర్లు పిలిచామని, త్వరలో అగ్రిమెంట్ ఖరారైన వెంటనే పనులు చేపడతామన్నారు.