Share News

నగరంలో మిలాన్‌

ABN , Publish Date - May 30 , 2025 | 12:54 AM

విశాఖ నగరంలో ముచ్చటగా మూడోసారి ‘మిలాన్‌’ను నిర్వహించనున్నారు.

నగరంలో మిలాన్‌

  • ముచ్చటగా మూడోసారి విశాఖ వేదిక

  • ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు ఏర్పాట్లు

  • ఫిబ్రవరి 14 నుంచి 24 వరకు నిర్వహణ

  • 145 దేశాలకు ఆహ్వానం పంపిన నేవీ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ నగరంలో ముచ్చటగా మూడోసారి ‘మిలాన్‌’ను నిర్వహించనున్నారు. దీంతోపాటే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు ప్రతిష్టాత్మకమైన నేవీ కార్యక్రమాలను వచ్చే ఏడాది అంటే.. 2026లో ఫిబ్రవరి 14 నుంచి 24వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహించనున్నారు. దీంతో విశాఖపట్నం విదేశీ అతిథులతో కళకళలాడనున్నది.

మిత్ర దేశాల నౌకాదళాలతో కలిసి నిర్వహించే బహు పాక్షిక విన్యాసాలనే (మల్టీలేటరల్‌ నేవల్‌ ఎక్సర్‌సైజ్‌ -మిలాన్‌)గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. త్రివిధ దళాలకు ముఖ్య అధిపతి. రాష్ట్రపతి నౌకాదళాలను సమీక్షించడాన్ని ‘ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌)’ అంటారు. పూర్తిగా భారతదేశ నౌకలను సమీక్షిస్తే పీఎఫ్‌ఆర్‌గా పేర్కొంటారు. ఇందులో విదేశీ నౌకలు కూడా పాల్గొంటే.. దానిని ‘అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)’గా పిలుస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిలాన్‌తో పాటు ఐఎఫ్‌ఆర్‌ కూడా నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సమీర్‌ సక్సేనా విజయవాడలో బుధవారం వెల్లడించారు. ప్రతి రెండేళ్లకోసారి మిలాన్‌ నిర్వహించడం ఆనవాయితీ. అప్పట్లో అండమాన్‌ కేంద్రంగానే ఈ విన్యాసాలు జరిగేవి. అయితే ఇందులో పాల్గొనే దేశాల సంఖ్య పెరగడంతో వేదికను విశాఖపట్నానికి మార్చారు. తొలి మిలాన్‌ 2020లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక్కడే 2022లో మొదటి మిలాన్‌ను, ఆ తరువాత 2024లో రెండో మిలాన్‌ను నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించేది మూడో మిలాన్‌. సుమారు 145 దేశాలకు ఆహ్వానం పంపినట్టు నేవీ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆపరేషన్‌ డెమో (సాహస విన్యాసాల ప్రదర్శన), ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు (ఫ్లై పాస్ట్‌), వివిధ దేశాల ప్రతినిధులతో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ వంటివి నిర్వహిస్తారు. వీటికి రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో నగరానికి కొత్త సొబగులు అద్దుతారు.. అందంగా తీర్చిదిద్దుతారు.

Updated Date - May 30 , 2025 | 12:54 AM