Share News

వలస పక్షులు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:38 AM

వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి, పెత్తనం చెలాయించిన ఆ పార్టీ నేతలు పలువురు...కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కండువాలు మార్చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పట్టుసడలకుండా ఉండడానికి అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరుతున్నారు. ఈ విషయంలో జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గం మొదటి వరుసలో ఉంది. వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రాజకీయ శూన్యతను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరుతున్నారు. మరికొంతమంది క్యూలో ఉన్నారు.

వలస పక్షులు

ముందస్తు వ్యూహంతో కూటమి పార్టీల్లోకి వైసీపీ నేతలు

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ

గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోగానే పక్క చూపులు

ఎలమంచిలి నియోజకవర్గంలో క్యూ కడుతున్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు

అత్యధికులు జనసేనలో చేరిక

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులే లక్ష్యం

అచ్యుతాపురం/ ఎలమంచిలి/ రాంబిల్లి/ మునగపాక, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి, పెత్తనం చెలాయించిన ఆ పార్టీ నేతలు పలువురు...కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కండువాలు మార్చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పట్టుసడలకుండా ఉండడానికి అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరుతున్నారు. ఈ విషయంలో జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గం మొదటి వరుసలో ఉంది. వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రాజకీయ శూన్యతను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరుతున్నారు. మరికొంతమంది క్యూలో ఉన్నారు.

నాలుగేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గంలో 90 శాతం సర్పంచు పదవులను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం 103 పంచాయతీలకుగాను 91 పంచాయతీల్లో వైసీపీ పాగా వేసింది. మరో ఆరు నెలల తరువాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్థానాలను (58) వైసీపీ గెలుచుకుంది (కొంతకాలం తరువాత అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో ఒక ఎంపీటీసీ మెంబర్‌ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది). ఎమ్మెల్యే అండతో పలువురు సర్పంచులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, భూ దందాలు సాగించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల నేతలు సెజ్‌ కంపెనీల్లో వివిధ రకాల కాంట్రాక్టులను బలవంతంగా చేజిక్కించుకున్నారు. రెండు చేతులా ఎడాపెడా సంపాదించేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వీళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. గ్రామాల్లో కూటమి నేతలు పట్టు సాధించారు. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇది మింగుడు పడడంలేదు. ఐదేళ్లపాటు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన వైసీపీ నేతలు...గ్రామాల్లో తమ పట్టు సడలకుండా వుండడానికి అధికారంలో వున్న టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది మాత్రం గత ఎమ్మెల్యేతో పొసగక ఎన్నికల ముందే కూటమి పార్టీల్లో చేరారు. ఎన్నికల తరువాత వైసీపీ నుంచి కొందరు కూటమిలోకి క్యూ కడుతున్నారు. వలస పక్షుల్లో అత్యధికులు జనసేలో చేరారు. ఆయా గ్రామాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం వుండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేకపోవడం, మరోవైపు పొత్తులో భాగంగా కనీసం 30 శాతం స్థానాలను తీసుకోవాలని జనసేన అధిష్ఠానం భావిస్తుండడంతో, ఆ పార్టీ తీసుకునే పంచాయతీలు/ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది జనసేనలో చేరుతున్నట్టు తెలిసింది. ఆర్థికంగా బలంగా వుండడంతో ఎన్నికల్లో ఎంతైనా ఖర్చుపెడతామని చెప్పి టికెట్లు పొందే ప్రయత్నం చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. వైసీపీ నేతలు తమ సొంత అభివృద్ధే ముఖ్యమన్న ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.

ఎన్నికల ముందు కూటమిలో చేరినవారు..

ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో పొసగక అచ్యుతాపురం మండలం ఖాజీపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పీలా ధనలక్ష్మి (సందీప్‌), చిప్పాడ ఎంపీటీసీ సభ్యుడు రాజాన పైడి భాస్కరరావు, పూడిమడక ఎంపీటీసీ సభ్యురాలు పోలవరం లక్ష్మీకాంతం, అచ్యుతాపురం ఎంపీటీసీ సభ్యురాలు ద్వారపురెడ్డి వెంకటలక్ష్మి (బాపూజీ) ఎన్నికల ముందే జనసేనలో చేరారు. దొప్పెర్ల సర ్పంచ్‌ కొరుప్రోలు చిన్నారావు, నునపర్తి సర ్పంచ్‌ చుక్క అనూరాధ బీజేపీలో చేరారు. దిబ్బపాలెం ఉపసర్పంచ్‌ రాజాన విజయ్‌ టీడీపీలో చేరారు. రాంబిల్లి మండలంలో వైఎస్‌ ఎంపీపీ, దిమిలి ఎంపీటీసీ సభ్యురాలు కోటాపు లక్ష్మి, వెల్చూరు సర్పంచ్‌ కిల్లాడ మంగయ్యమ్మ, రాజుకోడూరు సర్పంచ్‌ ముత్తా శంకరరావు, మామిడివాడ సర్పంచ్‌ మట్టా అప్పలనర్స, కొత్తూరు ఎంపీటీసీ శానాపతి రత్నం, గోకివాడ ఎంపీటీసీ సభ్యుడు అల్లవరపు నాగేశ్వరరావు, మునగపాక మండలం నాగవరం ఎంపీటీసీ సభ్యుడు పాలిపిని శ్రీనివాసరావు గత ఏడాది ఎన్నికల ముందే జనసేనలో చేరారు.

ఎన్నికల తరువాత అచ్యుతాపురం మండలంలో వలసలు

గత ఏడాది ఎన్నికల తరువాత దోసూరు ఎంపీటీసీ సభ్యురాలు రాజాన పద్మజ (అప్పారావు), మల్లవరం సర్పంచ్‌ పిన్నమరాజు వాసు, ఉప్పవరం సర్పంచ్‌ సకల ఉమామహేశ్వరి, ఆవరాజాం ఉప సర్పంచ్‌ పిల్లి సత్తిబాబు జనసేనలో చేరారు. మరో ఆరుగురు వైసీపీ సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

మునగపాక మండలంలో..

రాజుపేట సర్పంచ్‌ కిల్లాడ దేముళ్లు, గంటవానిపాలెం సర్పంచ్‌ కోన వెంకటలక్ష్మి, మునగపాక ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, చెర్లోపాలెం ఎంపీటీసీ సభ్యులు, వైస్‌ ఎంపీపీ బోజా లక్ష్మి, నాగులాపల్లి-1 ఎంపీటీసీ సభ్యురాలు, వైస్‌ ఎంపీపీ చిందాడ దేవి జనసేనలో చేరారు. ఉమ్మలాడ సర్పంచ్‌ సూరిశెట్టి గంగయ్యమ్మ భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఎలమంచిలి మండలంలో..

ఎలమంచిలి మండలం రేగుపాలెం ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్‌ ఎంపీపీ రాజాన సూర్యచంద్ర శేషగిరిరావు, పురుషోత్తపురం సర్పంచ్‌ అయిన ఆయన భార్య రాజాన సునీత, ఎలమంచిలి వైస్‌ ఎంపీపీ, జంపపాలెం ఎంపీటీసీ సభ్యురాలు శిలపరశెట్టి ఉమ జనసేన పార్టీలో చేరారు.

రాంబిల్లి మండలంలో...

దిమిలి సర్పంచ్‌ బంగారు చిలుకు, కొత్తూరు సర్పంచ్‌ నానేపల్లి లక్ష్మి, కృష్ణంపాలెం సర్పంచ్‌ పైల సత్తిబాబు, కట్టుబోలు ఎంపీటీసీ సభ్యుడు జనపరెడ్డి చిన్న, మురకాడ ఎంపీటీసీ సభ్యుడు అమలుకంటి తాతాజీ, రజాల సర్పంచ్‌ పొన్నాడ లక్ష్మి.

Updated Date - Jun 16 , 2025 | 12:38 AM