Share News

అర్ధరాత్రి ఆక్రమణ

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:28 AM

కోట్లాది రూపాయల విలువైన స్టీల్‌ప్లాంటు స్థలాన్ని కొందరు కబ్జా చేసి, అర్ధరాత్రి సమయంలో పునాదులు నిర్మించడమే కాకుండా ఓ కాలనీ పేరుతో బోర్డును కూడా ఏర్పాటు చేసేశారు.

అర్ధరాత్రి ఆక్రమణ

దర్జాగా స్టీల్‌ప్లాంటు భూమి కబ్జా

పునాదులు తీసి, గోడల నిర్మాణం

నిర్వాసితుల కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు

పనుల్లో పాల్గొన్న వంద మంది...

కబ్జాదారులకు నోటీసులు, పోలీసులకు ఫిర్యాదు

గాజువాక/పెదగంట్యాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

కోట్లాది రూపాయల విలువైన స్టీల్‌ప్లాంటు స్థలాన్ని కొందరు కబ్జా చేసి, అర్ధరాత్రి సమయంలో పునాదులు నిర్మించడమే కాకుండా ఓ కాలనీ పేరుతో బోర్డును కూడా ఏర్పాటు చేసేశారు. వివరాల్లోకి వెళితే....

స్టీల్‌ప్లాంటుకు పెదగంట్యాడ మండలం వికాస్‌నగర్‌ ప్రభుత్వ న్యూ ఐటీఐ ముఖద్వారానికి ఆనుకుని ఉన్న సర్వే నంబరు 53లో అరఎకరా స్థలం ఉంది. అక్కడ గజం ధర సుమారు రూ.40 వేల వరకు ఉంది. కాలనీ మధ్యలో ఉన్న విలువైన స్థలంలో ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడే భవనాలు నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో దానిపై కబ్జాదారుల కన్ను పడింది. దీనికి స్టీల్‌ప్లాంటు భూ సేకరణ విభాగం అధికారులు పరోక్షంగా సహకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో వంద మందికి పైగా ఆ స్థలం వద్దకు చేరుకుని పనులు ప్రారంభించారు. అప్పటికప్పుడు పునాదులు తీసి, మూడు అడుగుల ఎత్తులో గోడల నిర్మాణం చేపట్టారు. ఆదివారం పూర్తిస్థాయిలో షెడ్లు నిర్మించే దిశగా సన్నాహాలు చేసుకున్నారు.

పనుల్లో వందలాది మంది

అర్ధరాత్రి సమయంలో సుమారు వంద మందికి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడకు చేరుకుని స్టీల్‌ప్లాంటు భూమిలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టడంపై నిరసన తెలిపారు. నేరుగా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కబ్జా వెనుక రాజకీయ ప్రముఖుల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంబంధిత విభాగాల అధికారులు కూడా సహకరించినట్టు సమాచారం.

అధికారులు ఒకలా... పోలీసులు మరోలా...

ఈ విషయమై స్టీల్‌ప్లాంటు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ సునీతను వివరణ కోరగా స్టీల్‌ప్లాంటు భూముల్లో అక్రమంగా పునాదులు వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే సిబ్బందిని పంపి విచారణ చేపట్టామని, 15 మంది కబ్జాకు పాల్పడినట్టు తెలిసిందని, వారికి నోటీసులు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాగా న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. స్టీల్‌ప్లాంటు స్థలం వద్దకు శనివారం రాత్రి సుమారు 50 మంది వరకు వచ్చారని సమాచారం అందడంతో వెళ్లామని, అయితే వారంతా పరారయ్యారని తెలిపారు. వెంటనే విషయాన్ని ఎస్‌డీసీ, పెదగంట్యాడ తహశీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్లాంటు భూములు కాపాడడంలో భూ సేకరణ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కబ్జాదారులు బరితెగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

ఆక్రమణల తొలగింపు

అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం పెదగంట్యాడ మండల రెవెన్యూ అధికారులకు తెలియడంతో సోమవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని కొన్ని ఆక్రమణలను తొలగించారు. అది స్టీల్‌ప్లాంటు భూసేకరణ విభాగానికి చెందిన స్థలమంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 25 , 2025 | 01:28 AM