పట్టాలెక్కనున్న మెట్రో రైలు ప్రాజెక్టు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:51 AM
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ శుక్రవారం టెండర్ విడుదల చేసింది.
టెండర్ల ఆహ్వానం
డబుల్ డెక్కర్ మోడల్ ...నాలుగు వరుసల ఫ్లైఓవర్
3 కారిడార్లు...46.23 కి.మీ. పొడవు
42 ఎలివేటెడ్ స్టేషన్లు
అంచనా వ్యయం రూ.6,250 కోట్లు
30 నెలల్లో మొత్తం పూర్తి...
24 నెలల్లో 20.16 కి.మీ. డబుల్ డెక్కర్ నిర్మాణం పూర్తి చేయాలని షరతు
సెప్టెంబరు 12న బిడ్లు ఓపెన్
ఇదీ కారిడార్ల తీరు
మొత్తం మెట్రో రైలు కారిడార్ పొడవు 46.23 కి.మీ.
- స్టీల్ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు 34.41 కి.మీ. ఒక కారిడార్ వస్తుంది. ఇందులోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఉంటుంది. దీని పరిధిలో 29 స్టేషన్లు వస్తాయి.
- గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ. పొడవున రెండో కారిడార్ వస్తుంది. ఈ మార్గంలో ఆరు స్టేషన్లు ఉంటాయి.
- తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కి.మీ. మూడో కారిడార్ ఉంటుంది. ఇందులో ఏడు స్ట్టేషన్లు వస్తాయి.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ శుక్రవారం టెండర్ విడుదల చేసింది. దీనికి అంతర్జాతీయ స్థాయిలో బిడ్డర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థే దీనికి ఇంజనీరింగ్, డిజైన్, నిర్మాణ బాధ్యతలు చూసుకోవలసి ఉంటుంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే తొలి దశలో స్టీల్ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు మెట్రో కారిడార్‌ను 46.23 కి.మీ. పొడవున నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో మూడు కారిడార్లు ఉంటాయి. అందులో 20.16 కి.మీ. మేర డబుల్ డెక్కర్ విధానంలో నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం వస్తుంది. వీటన్నింటికి అంచనా వ్యయం రూ.6,250 కోట్లు. దీనికి జీఎస్‌టీ అదనం. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పనులు ప్రాంభించిన తేదీ నుంచి 24 నెలల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. 30 నెలల్లో మొత్తం కారిడార్లు పూర్తిచేసి ఇవ్వాలి. ఈ మూడు కారిడార్లలో 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను నిర్మిస్తారు. ఈ నెల 28వ తేదీ నుంచే వెబ్‌సైట్‌లో టెండర్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 12వ తేదీన టెండర్లు వేసిన వారితో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి, సందేహాలు నివృత్తి చేస్తారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి పూర్తిచేసిన టెండర్ల స్వీకారం మొదలవుతుంది. అదే నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ టెండర్లను స్వీకరించి, 3.30 గంటలకు టెండర్లను తెరిచి కాంట్రాక్టు ఎవరికి దక్కిందో ప్రకటిస్తారని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.