మెట్రో రైలు భూసేకరణ పనులకు శ్రీకారం
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:19 AM
నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది.
సామాజిక ప్రభావ అంచనాపై సర్వే
తొలి దశలో 46.23 కి.మీ. పొడవున మూడు కారిడార్ల నిర్మాణం
87 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 9.22 ఎకరాలు పట్టా భూమి అవసరం
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 46.23 కి.మీ. పొడవున మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూమి 87 ఎకరాలు కాకుండా పట్టా భూమి 9.22 ఎకరాలు అవసరమని అధికారులు తేల్చారు. ఇది గాజువాక, గోపాలపట్నం మండలాలతో పాటు విశాఖపట్నం జోన్-3, 4, 5లలో ఉంది. వడ్లపూడి, మింది, చినగంట్యాడ, గాజువాక, అక్కిరెడ్డిపాలెం, తుంగ్లాం, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, కప్పరాడ, దొండపర్తి, అల్లిపురం, కంచరపాలెం, రేసపువానిపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, చినగదిలి, ఎండాడ, పోతినమల్లయ్యపాలెం, మధురవాడ, అల్లిపురం తదితర ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ భూములు తీసుకుంటే నిర్వాసితులయ్యే వారి పరిస్థితి ఏమిటి?, సామాజిక ప్రభావం ఎంత ఉంటుంది?...అనే అంశాలు అంచనా వేయడానికి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కలిసి రైజెస్ అనే బృందాన్ని ఏర్పాటుచేశారు. వీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి నూతన భూసేకరణ చట్టం 2013 ప్రకారం నివేదిక ఇవ్వాలి. ఈ బృందం సోమవారం గాజువాక ప్రాంతంలో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా బృంద సభ్యుడు ఆర్.దేవరాజు మాట్లాడుతూ భూములు కోల్పోయేవారు ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరామని, వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ప్రజాభిప్రాయ సేకరణలో తెలపవచ్చునన్నారు. వాటిని కూడా నివేదికలో పొందుపరిచి అధికారులకు సమర్పిస్తామన్నారు. ఈ సర్వేలో మెట్రో రైలు ప్రాజెక్టు డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, సర్వేయర్ శ్రీనుబాబు, ఇంజనీర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.