సెజ్‌లో మెగా యోగాంధ్ర రేపు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:42 PM
అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.

విజయవంతం చేసే బాధ్యత కంపెనీల యాజమాన్యాలదే
కలెక్టర్ విజయకృష్ణన్
రాంబిల్లి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. మంగళవారం సెజ్‌లోని లారస్ కంపెనీ అడ్మిన్ కార్యాలయంలో పలు కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెగా యోగాంధ్ర కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి పది వేల మందికిపైగా హాజరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థలం కేటాయింపు, రూట్‌మ్యాప్ వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో సెజ్ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు మన్నె ప్రసాద్, అనకాపల్లి ఆర్డీఓ ఆయీషా బేగమ్, రాంబిల్లి తహశీల్దారు శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.