మెగా విశాఖ?
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:17 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
పెందుర్తి, భీమిలి మండలాల్లో మిగిలిన గ్రామాలు, ఆనందపురం, పద్మనాభం మండలాలు జీవీఎంసీలోకి...
సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఎంఏకు ప్రభుత్వం ఆదేశం
విలీనం జరిగితే జిల్లా అంతా జీవీఎంసీలోనే...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. భీమిలి, పెందుర్తి మండలాల్లో గల మిగిలిన గ్రామాలతోపాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను పూర్తిగా జీవీఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంఏను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.
జీవీఎంసీ ప్రస్తుతం 682 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సుమారు 21 లక్షల మంది జనాభా ఉండగా, 98 వార్డులుగా విభజించారు. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌ను 20 ఏళ్ల కిందట గాజువాక, పెందుర్తి మండలంలోని కొన్ని ప్రాంతాలు, మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది పరిసర ప్రాంతాలను కలుపుతూ జీవీఎంసీగా అప్‌గ్రేడ్ చేశారు. 2011లో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలతో పాటు పలు గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే కొన్ని గ్రామాల నాయకులు అభ్యంతరం చెబుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విలీన ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు 2020లో ఇటు అనకాపల్లి, అటు భీమిలి మునిసిపాలిటీతో కూడిన జీవీఎంసీని 98 వార్డులుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17తో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికలపై చర్చ మొదలైంది. అయితే భీమిలి, పెందుర్తి మండలాల్లో జీవీఎంసీ పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన ప్రాంతాలతోపాటు పద్మనాభం, ఆనందపురం మండలాలను కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, గంటా శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వానికి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీడోల బాలవీరాంజనేయస్వామికి ప్రభుత్వం సూచించింది. మంత్రి ఆయా ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ సంపత్‌కుమార్‌ను ఆదేశిస్తూ సురేష్‌కుమార్ మెమో జారీచేశారు. దీంతో విలీన ప్రక్రియ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనే సంకేతాలు వెలువడినట్టయింది.
విలీనం జరిగితే జిల్లా మొత్తం జీవీఎంసీ పరిధిలోకే...
ఆ నాలుగు మండలాలు జీవీఎంసీలో విలీనం అయితే జిల్లా మొత్తం నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చేసినట్టవుతుంది. జీవీఎంసీ జనాభా ప్రస్తుతం 21 లక్షలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నాలుగు మండలాలు విలీనమైతే వాటి పరిధిలోని 87 గ్రామాల్లో గల సుమారు నాలుగు లక్షల మందిని కలుపుకుని జనాభా సంఖ్య 25 లక్షలు దాటుతుంది. జీవీఎంసీలో నాలుగు మండలాల విలీనం ప్రక్రియ మొదలైతే ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.